Mobile Popup Ad
Mobile Popup Ad

హైకోర్టు సీరియస్.. అర్ధరాత్రైనా ఆర్థిక శాఖ కార్యదర్శి విచారణకు రావాల్సిందే!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఫైనాన్స్ సెక్రెటరీపై రాష్ట్ర హైకోర్టు (Telangana High Court) సీరియస్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు (Retired Employees Dues) రెండేళ్లుగా చెల్లించలేదన్న పిటిషన్ పై సోమవారం అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. కోర్టుకు వ్యక్తిగతంగా ఫైనాన్స్ సెక్రటరీ హాజరు కాకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పెండింగ్ లో ఉన్న బకాయిలను త్వరితగతిన చెల్లించాలని గత ఏడాది ప్రభుత్వానికి, ఫైనాన్స్ సెక్రెటరీకి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే బకాయిలు చెల్లించకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద రిటైర్డ్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు.. సోమవారం వ్యక్తి గతంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఫైనాన్స్ సెక్రెటరీ గతంలోనే ఆదేశించారు. తాజాగా ఇవాళ 644 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. న్యాయస్థానం ఎదుట ఫైనాన్స్ సెక్రెటరీ హాజరు కాకపోవడంపై కోర్టు మండిపడింది. ఆరు నూరైన ఈరోజు విచారణకు హాజరు కావాల్సిందేనని ఆర్థిక శాఖ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఆర్థిక శాఖ కార్యదర్శి (finance secretary) హాజరు కాలేకపోయారని ప్రభుత్వ తరుపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీంతో ఈరోజు అర్ధరాత్రి వరకు కోర్ట్ హాల్ లోనే ఉంటామని, వ్యక్తిగత హాజరుకు ఎట్టి పరిస్థితుల్లో మినహాయింపు ఇచ్చే ప్రసక్తి లేదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఏడాది క్రితమే బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చామని.. కోర్ట్ ధిక్కరణ కింద నోటిసులు ఇచ్చి ఆరు నెలలు అయిందని మండిపడ్డారు. ఈ కాలంలోనే పదుల సంఖ్యలో విశ్రాంత ఉద్యోగులు మరణించినట్లు వార్తలు వచ్చాయన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నట్లు ఆర్థిక శాఖ కార్యదర్శికి ముందే తెలుసు కదా? ముందే న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సి ఉండేది అని చురకలు అంటించారు. కోర్టు ధిక్కరణ అంశాలు ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్థిక శాఖ కార్యదర్శి కోర్టు ఎదుట హాజరు అవుతారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>