కలం, క్రైమ్ బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వం మరోసారి ఐపీఎస్‌లను బదిలీ (IPS Transfers) చేసింది. 12 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకు తన ప్రస్తుత బాధ్యతలతో పాటు డీఐజీ, జోన్-1 (కాళేశ్వరం) అదనపు బాధ్యతలు అప్పగించారు.
హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డా. జోయెల్ డేవిస్‌కు డీఐజీ, జోన్-5 (యాదాద్రి) అదనపు బాధ్యతలు కేటాయించారు. వరంగల్ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్‌కు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా బదిలీ చేయడంతో పాటు డీఐజీ, జోన్-3 (రాజన్న సిరిసిల్ల) అదనపు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ ఉత్తర మండలం (లా అండ్ ఆర్డర్) జాయింట్ కమిషనర్ ఎం. స్వేతను వరంగల్ పోలీసు కమిషనర్‌గా నియమించి, అదనంగా డీఐజీ, జోన్-4 (భద్రాద్రి) బాధ్యతలు అప్పగించారు. ఇంటెలిజెన్స్ విభాగం డీఐజీ (సి ఐ) ఆర్. భాస్కరన్‌ను డీఐజీ, జోన్-2 (బాసర) అదనపు బాధ్యతలు కేటాయించారు.
హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఎస్.ఎం. విజయ్ కుమార్‌ను హైదరాబాద్ ఉత్తర మండలం లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సింధు శర్మను సీఐ సెల్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా బదిలీ చేసి, అదనంగా ఎస్‌ఐబీ ఎస్పీ బాధ్యతలు అప్పగించారు. వై. సాయి శేఖర్‌ను సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా నియమించారు.
హైదరాబాద్ ఎస్‌ఎం & ఐటీ డీసీపీ చెర్నూరి రూపేష్ను సీఐడీ ఎస్పీగా బదిలీ చేశారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సి. ప్రవీణ్ కుమార్‌ను సీఐడీ ఎస్పీగా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఆర్. వెంకటేశ్వర్లును సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్, హైదరాబాద్ డీసీపీగా నియమించారు.రాజేష్ మీనాని వనపర్తి నుంచి బదిలీ చేసి వికారాబాద్ అదనపు ఎస్పీ (అడ్మిన్)గా నియమించారు.

