కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వరి పంట తరహాలోనే ఈసారి మొక్కజొన్న దిగుబడి కూడా గణనీయంగా పెరిగిందని, కానీ కొనడానికి కేంద్రం సిద్ధం కాకపోవడంతో రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వమే (Telangana Govt) కొనాలని నిర్ణయం తీసుకున్నదని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి మొక్కజొన్న 16 లక్షల ఎకరాల్లో సాగైందని, ఒక్కో ఎకరానికి సగటున 27 క్వింటాళ్ళ చొప్పున మొత్తం 43 లక్షల టన్నుల దిగుబడి అవుతుందని మంత్రి తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లించడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,173 కోట్ల మేర గ్యారంటీ ఇవ్వగా ఇప్పుడు అదనంగా మరో 6.53 లక్షల టన్నుల కొనుగోలు కోసం రూ. 1868 కోట్ల గ్యారంటీ ఇచ్చిందని వివరించారు. రాష్ట్రంలో ఈ పంట పండుతున్న జిల్లాల్లో 354 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే 13 లక్షల టన్నులను కొన్నామని, సుమారు 2.33 లక్షల మంది రైతులకు డబ్బు చెల్లించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో మొక్కజొన్న కొనుగోళ్ల కోసం మొత్తం రూ. 5,063 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, కానీ ఇప్పుడు ప్రస్తుత (యాసంగి) సీజన్‌లోనే దాదాపు రూ. 6,000 కోట్ల మేర ఖర్చు చేస్తున్నదని తెలిపారు. రైతు సంక్షేమంపై చిత్తశుద్ధి ఏ ప్రభుత్వానిదో ఈ గణాంకాలే నిదర్శనమన్నారు. రైతుల పేరుతో కొన్ని పార్టీల నేతలు రాజకీయ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. మొక్కజొన్నకు మార్కెట్‌లో క్వింటా ధర రూ. 1,700 నుండి రూ. 1,850 మధ్య మాత్రమే ఉన్నదని, కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకున్నదని మంత్రి వివరించారు. హైబ్రిడ్ జొన్న కొనుగోళ్లపైనా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నదని, మార్కెట్‌లో క్వింటాకు సుమారు రూ.2,000 మాత్రమే ఉన్నా కేంద్రం నిర్ణయించిన ఎంఎస్పీ ప్రకారం రూ. 3,699కు రాష్ట్రం కొంటున్నట్లు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ. 1,100 కోట్లు ఎక్కువ ఖర్చవుతుందని తెలిసినా ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4.03 లక్షల ఎకరాల్లో జొన్న సాగు జరిగిందన్నారు. జిల్లాల వారీగా జొన్న కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో 26 కేంద్రాలు, సంగారెడ్డి జిల్లాలో 10 కేంద్రాలు, కామారెడ్డి జిల్లాలో 43 కేంద్రాలు, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేంద్రాలు పెట్టినట్లు తెలిపారు. గద్వాల, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోనూ కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.
జొన్నల కొనుగోళ్ళకు గత ప్రభుత్వం పదేళ్లలో కేవలం రూ. 374 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, ఇప్పుడు ఒక్క సీజన్‌లోనే దాదాపు రూ. 800 కోట్లు కేటాయించినట్లు వివరించారు. పొద్దుతిరుగుడు పంటను కేంద్రం కేవలం 25% కొంటామని పరిమితి విధించిందని, కానీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ పరిమితికి మించి కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు. పొద్దుతిరుగుడు ఎంఎస్పీ క్వింటాకు రూ. 7,721 ఉంటే మార్కెట్ ధర రూ. 5,376 మాత్రమే ఉన్నదని, రైతులు నష్టపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం తన నిధి నుంచి అదనంగా 10,175 టన్నులను కొనాలని నిర్ణయం తీసుకున్నదన్నారు.

