కలం, వెబ్ డెస్క్ : ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా భరత్‌భూషన్, వైస్ ఛైర్మన్‌గా మెహర్ రమేష్ ఆదివారం ప్రమాణం స్వీకారం చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కొత్తగా రిలీజ్ అవుతోన్న ప్రతి సినిమాకు 60 నుంచి 70 శాతం కలెక్షన్లు ఆంధ్ర రాష్ట్రం నుంచే వస్తున్నాయని.. రాష్ట్రాలు విడిపోయినా కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదని వ్యాఖ్యానించారు.
అయితే ప్రస్తుతం సినీ పరిశ్రమ కష్టాల్లో ఉందని బాలకృష్ణ అన్నారు . టెక్నిక్ లేని రోజుల్లోనే ఫాస్ట్‌గా సినిమాలు పూర్తయ్యేవి, ఇప్పుడు టెక్నిక్ పెరిగిపోయి చాలా ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఫలితంగా ఎగ్జిబిటర్ల పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పారు. ఎగ్జిబిటర్లు థియేటర్లకు తాళాలు వేసుకునే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమను ఐక్యంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి. అందులోనూ సందేశాత్మక కథలతో కూడిన మంచి సినిమాలను ప్రేక్షకులను అందించాలని పిలుపునిచ్చారు.
తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ హయాం నుంచి సినీ పరిశ్రమకు ఏపీలో విజయవాడ, వైజాగ్ రాజధానులుగా భాసిల్లుతుందని బాలకృష్ణ గుర్తు చేశారు. త్వరలో నిలిచిపోయిన నందితో పాటు మిగిలిన సినీ పురస్కారాలను తిరిగి ప్రారంభించే పనిలో తమ ప్రభుత్వం ఉందని వివరించారు. ఏపీలో చాలా షూటింగ్ లు జరుగుతున్నాయని వెల్లడించారు. ఏపీలో షూటింగ్‌లకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోవడానికి టాలీవుడ్ ను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న బాలకృష్ణ.. తెలంగాణ ప్రభుత్వం కూడా చిత్ర పరిశ్రమకు సహాయసహకారాలు అందించాలని కోరారు.

