కలం, నారాయణపేట: జీఐ ట్యాగ్ పొందిన నారాయణపేట (Narayanpet) చేనేత చీరలకు దేశ, విదేశాల్లో విశేష ఆదరణ ఉందని కలెక్టర్ ప్రియాంక అన్నారు. చేనేత వృత్తి జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని, ఈ గొప్ప సంప్రదాయాన్ని భావితరాలకు అందించే బాధ్యత అందరిపై ఉందన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగారం మలుపు దారి వద్ద ఉన్న వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తాను బాధ్యతలు స్వీకరించిన అనంతరం నారాయణపేట, కోటకొండ, జాజాపూర్ తదితర ప్రాంతాల్లోని చేనేత కుటుంబాలను సందర్శించి వారి పనితీరును స్వయంగా పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు. చేనేత కార్మికుల ప్రతిభ, నైపుణ్యం అభినందనీయమని, వారు తయారు చేసిన చీరలను తాను కూడా కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
అండగా రాష్ట్ర ప్రభుత్వం..
చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ అండగా ఉంటుందని కలెక్టర్ ప్రియాంక తెలిపారు. నారాయణపేట చేనేత ఉత్పత్తులకు ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల నుంచి ఆన్లైన్ ద్వారా ఆర్డర్లు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ అవకాశాలను మరింత విస్తరించేందుకు మార్కెటింగ్, ఈ-కామర్స్ వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. చేనేత కుటుంబాల యువతను గుర్తించి వెబ్సైట్ నిర్వహణ, ఫోటోగ్రఫీ, సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ విక్రయాలపై ప్రత్యేక శిక్షణ అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఆన్లైన్ విక్రయాలకు ప్రోత్సాహం..
మహిళా సంఘాల ద్వారా ఉత్తమ చేనేత ఉత్పత్తులను ఎంపిక చేసి ఆన్లైన్ విక్రయాలకు ప్రోత్సహించనున్నట్లు కలెక్టర్ ప్రియాంక తెలిపారు. దీంతో కార్మికులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నారాయణపేటలో ఏర్పాటు చేసిన ఆధునిక చేనేత కేంద్రంలో మగ్గాలు, కుట్టు యంత్రాలు, డైయింగ్ యూనిట్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
ఈ కేంద్రాన్ని త్వరలో ప్రారంభించి టెస్కో ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మహిళా సంఘాల భాగస్వామ్యంతో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి చేనేత ఉత్పత్తులకు మరింత విస్తృత మార్కెట్ కల్పిస్తామని తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. పలువురు సీనియర్ చేనేత కార్మికులను శాలువాలతో సన్మానించి వారి సేవలను అభినందించారు.

