ఈసారి నలుగురు భారత గ్రాండ్‌మాస్టర్లు.. EWC చెస్‌లో చరిత్ర

కలం, స్పోర్ట్స్ : ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్ చెస్‌(Esports World Cup Chess)లో భారత్ కొత్త రికార్డు సృష్టించబోతోంది. ఈసారి నలుగురు భారత గ్రాండ్‌మాస్టర్లు ఒకేసారి బరిలోకి దిగుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే భారత ప్రాతినిధ్యం రెండింతలు కావడం విశేషం. పారిస్‌లో ఆగస్టు 11 నుంచి 15 వరకు జరిగే ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్ చెస్ టోర్నీలో భారత్ నుంచి నిహాల్ సరిన్, అరవింద్ చితంబరం, ప్రణేష్ ఎం, అర్జున్ ఎరిగైసీ పోటీ పడనున్నారు. ఇది ఈ టోర్నీలో భారత చెస్‌కు ఇప్పటివరకు లభించిన అత్యధిక ప్రాతినిధ్యం.

నిహాల్, ప్రణేష్, అర్జున్ నేరుగా గ్రూప్ దశకు చేరుకోగా, అరవింద్ ప్లే-ఇన్ రౌండ్ నుంచి తన పోరును ప్రారంభించనున్నాడు. మొత్తం 15 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ కోసం ప్రపంచ అగ్రశ్రేణి గ్రాండ్‌మాస్టర్లతో భారత ఆటగాళ్లు తలపడనున్నారు. గత ఏడాది నిహాల్ క్వార్టర్ ఫైనల్ చేరగా, అర్జున్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఆ అనుభవంతో ఈసారి భారత జట్టు మరింత బలంగా బరిలోకి దిగుతోంది. ఈ ఏడాది టోర్నీకి కొత్త ఫార్మాట్ తీసుకొచ్చారు. ప్లే-ఇన్, గ్రూప్ దశ, ప్లేఆఫ్స్‌గా మూడు దశల్లో పోటీ సాగుతుంది.

చివరగా గ్రాండ్ ఫైనల్‌లో విజేతను నిర్ణయిస్తారు. డిఫెండింగ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సెన్, హికారు నకమురా, అలిరెజా ఫిరూజా, నోదిర్‌బెక్ అబ్దుసత్తోరోవ్, హాన్స్ నీమన్ వంటి ప్రపంచ అగ్ర ఆటగాళ్లు కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఇటీవలి కాలంలో భారత చెస్ ప్రపంచ వేదికపై వేగంగా ఎదుగుతోంది. యువ గ్రాండ్‌మాస్టర్ల రాకతో అంతర్జాతీయ టోర్నీల్లో భారత్ ప్రభావం మరింత పెరుగుతోంది. అదే జోరును కొనసాగిస్తూ, ఈసారి భారత ఆటగాళ్లు తొలి EWC చెస్ టైటిల్ కోసం పోటీ పడనున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>