కలం, కరీంనగర్ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని కేవలం మెదక్, గజ్వేల్ ప్రాంతాల ప్రయోజనాల కోసమే ఉపయోగించుకుందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చుక్క నీరు కూడా అందించలేదని తెలంగాణ ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే (Peddapalli MLA) చింతకుంట విజయ రమణారావు (Vijaya Ramana Rao) ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల, తారుపల్లి, మీర్జంపేట, కాల్వ శ్రీరాంపూర్ గ్రామాలలో రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బ్రిడ్జిలు, మార్కెట్ భవనం, మహిళా భవనం, సీసీ రోడ్లు, ప్రహరీలు, కల్వర్టు నిర్మాణ పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎక్కడా నీరు అందలేదని విమర్శించారు. కేవలం మెదక్ జిల్లా, గజ్వేల్, సిద్దిపేట ప్రాంతాలకే నీటిని తరలించారని ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 6 లక్షల ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ ద్వారానే నీరు అందుతోందని తెలిపారు. “కాళేశ్వరం నీళ్లు ఏ నియోజకవర్గానికి, ఏ గ్రామానికి ఇచ్చారో బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి” అని విజయ రమణారావు సవాల్ విసిరారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై తదుపరి చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రీ-కన్స్ట్రక్షన్ చేపడతామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతినడానికి గత ప్రభుత్వ నిర్ణయాలే కారణమని ఆరోపించిన ఆయన, తుమ్మిడిహట్టి ద్వారా నీటిని తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలి
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజయ రమణారావు సూచించారు. నాలుగు ఎకరాల భూమి ఉన్న రైతులు రెండు ఎకరాలలో వరి సాగు చేసి, మిగిలిన భూమిలో కంది, నువ్వులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. డీఏపీకి ప్రత్యామ్నాయంగా సూపర్, నానో ఎరువుల వినియోగం ప్రయోజనకరమని సూచించారు. శ్రీరాంపూర్లోని 30 పడకల ఆసుపత్రిని గత ప్రభుత్వం 6 పడకలకు కుదించిందని విమర్శించిన ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దానిని తిరిగి 30 పడకల ఆసుపత్రిగా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
బస్సు సర్వీసు ప్రారంభం
కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాతపల్లి గ్రామంలో హుజూరాబాద్–జమ్మికుంట నుంచి గోదావరిఖనికి వెళ్లే బస్సు సర్వీసును ప్రభుత్వ విప్ విజయ రమణారావు ప్రారంభించారు. ఈ బస్సు ఇదిలాపూర్, పెద్దరాతపల్లి, కాల్వ శ్రీరాంపూర్, మొట్లపల్లి, మీర్జంపేట, కిష్టంపేట గ్రామాల మీదుగా నడుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ సర్పంచులు, మార్కెట్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

