epaper
Wednesday, February 18, 2026
epaper

తెలంగాణలో ఐఏఎస్‌ల‌ బదిలీలు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ (Telangana) ప్రభుత్వం పరిపాలనా అవసరాల దృష్ట్యా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ (IAS Transfers) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మ‌రికొంద‌రు అధికారుల‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు బుధ‌వారం ఉద‌యం సాధారణ పరిపాలన విభాగం నుంచి జీవో 202 విడుదలైంది. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం ప‌లువురు అధికారులు కీల‌క శాఖ‌ల‌కు బ‌దిలీ కానున్నారు. జ్యోతి బుద్ధ ప్రకాష్ ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా పని చేస్తుండగా, ఆమెను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఈ పదవిని అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్న డి.కృష్ణ భాస్కర్‌ను బాధ్యతల నుంచి విముక్తి చేశారు.

సబ్యసాచీ ఘోష్ ప్రస్తుతం ఫ్లాగ్‌షిప్ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు విభాగంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆయనకు ఎస్సీ అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, కమిషనర్ బాధ్యతలు అదనంగా అప్పగించారు. ఆయనకు ఇప్పటికే ఉన్న గిరిజన సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలు అలాగే కొనసాగుతాయి. ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సందీప్ కుమార్ సుల్తానియాకు ప్లానింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్ప‌గించారు.

ప్రస్తుతం సెర్ప్‌ సీఈఓగా ఉన్న డి.దివ్యకు అద‌నంగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బాధ్యతలు అప్పగించారు. ఇక ఆర్‌వీ కర్ణన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గానే కొనసాగ‌నున్నారు. శ్రీజనను జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ పదవి నుంచి బదిలీ చేసి, కొత్తగా ఏర్పాటు చేసిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు. అలాగే జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా ఉన్న టి.వినయ్ కృష్ణా రెడ్డిని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ చేశారు.

కాత్యాయనీ దేవిని సెర్ప్‌ అదనపు సీఈఓ పదవి నుంచి బదిలీ చేసి ఆమెను ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. ఆమెకు ప్ర‌స్తుతం ఉన్న‌ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అదనపు బాధ్యతలు అలాగే కొనసాగుతాయి. ప్రస్తుతం హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న మయాంక్ మిట్టల్ అదే సంస్థలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియ‌మితుల‌య్యారు. ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల మంత్రికి ఓఎస్‌డీగా ఉన్న రఘురాం శర్మను ఇండస్ట్రీస్, కామర్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు. ర‌ఘురాం శ‌ర్మ మంత్రికి ఓఎస్‌డీగా అద‌న‌పు బాధ్యతలు కూడా నిర్వ‌ర్తించ‌నున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>