రైతుల సంక్షేమమే దేశ సంక్షేమం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

కలం, నిజామాబాద్ బ్యూరో: రైతుల సంక్షేమమే రాష్ట్ర, దేశ సంక్షేమమని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) అన్నారు. పసుపు సాగులో ఆధునిక సాంకేతికతను వినియోగించడంతో పాటు సహజ వ్యవసాయ పద్ధతులు, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు, బలమైన మార్కెట్ అనుసంధానంతో రైతుల ఆదాయాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్‌లోని (Nizamabad) జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో పసుపు రైతులతో గవర్నర్ ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమక్షంలో ‘సునహరి మిట్టి అభియాన్’, మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఉత్తమ రైతు సంఘాలకు మెమంటోలు అందించి అభినందించారు.

ఈ సందర్భంగా పసుపు రైతులను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ నిజామాబాద్‌కు పసుపు సాగులో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. సారవంతమైన నేలలు, రైతుల కృషితో ఈ ప్రాంతం దేశంలోని ప్రముఖ పసుపు ఉత్పత్తి కేంద్రంగా ఎదిగిందని పేర్కొన్నారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు కావడం ఈ ప్రాంత రైతుల చిరకాల ఆకాంక్షకు ప్రతీకగా నిలిచిందని అన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక చొరవ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో ఇది సాకారమైందని తెలిపారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చేందుకు ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు.

భారతీయ సంస్కృతిలో పసుపుకు ప్రత్యేక స్థానం

పసుపు కేవలం వ్యవసాయ ఉత్పత్తి మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, నిత్యజీవితంతో ముడిపడిన విలువైన సంపద అని గవర్నర్ పేర్కొన్నారు. భారతదేశ వ్యవసాయ వారసత్వానికి పసుపు ప్రతీకగా నిలుస్తోందని అన్నారు.  రైతులు, శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులు, పరిశ్రమలు, ప్రభుత్వాలు సమష్టిగా పనిచేస్తే భారత పసుపుకు ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లలో మరింత బలమైన స్థానం కల్పించవచ్చని గవర్నర్ అన్నారు. పసుపు ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు, ఎగుమతుల వరకు సమగ్ర విధానంతో ముందుకు సాగాలని సూచించారు.

నాలుగు దశాబ్దాల కల నెరవేరింది

ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న ఈ ప్రాంత పసుపు రైతుల నాలుగు దశాబ్దాల కలను కేంద్ర ప్రభుత్వం సాకారం చేసిందని అన్నారు. బోర్డు ఏర్పాటు ద్వారా పసుపు రైతులకు అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. పసుపు క్వింటాలుకు లభిస్తున్న ధర గతంతో పోలిస్తే పెరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, నగర మేయర్ ఉమారాణి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పి. రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానీ శ్రీ, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>