సురేష్ జోరు.. ATP టూర్‌లో భారత్‌కు అరుదైన ఘనత

కలం, స్పోర్ట్స్: భారత టెన్నిస్ ఆటగాడు ధక్షినేశ్వర్ సురేష్ (Dhakshineswar Suresh)  ATP టూర్‌లో తొలి విజయాన్ని నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. విన్‌స్టన్-సేలమ్ ఓపెన్‌లో ప్రపంచ 394వ ర్యాంక్‌లో ఉన్న సురేష్ సంచలన విజయం సాధించాడు. ప్రపంచ 77వ ర్యాంకర్ మార్కోస్ గిరాన్‌ను వరుస సెట్లలో ఓడించాడు. 17 ఏస్‌లతో అదరగొట్టిన సురేష్ 6-3, 7-5 తేడాతో గంటలోపే మ్యాచ్‌ను ముగించాడు. నార్త్ కరోలినాలోని వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ తరఫున కాలేజ్ టెన్నిస్ ఆడుతున్న సురేష్‌కు విన్‌స్టన్-సేలమ్ కోర్టులు, వాతావరణంపై మంచి అవగాహన ఉంది. ఈ ఏడాది టోర్నీ క్వాలిఫయర్స్‌లో ఓడిపోయినప్పటికీ.. లక్కీ లూజర్ కోటాలో మెయిన్ డ్రాలోకి ప్రవేశించాడు.

తొలి సెట్‌లోనే దూకుడు

మ్యాచ్ ప్రారంభం నుంచే సురేష్ దూకుడుగా ఆడాడు. గిరాన్ సర్వ్‌ను త్వరగానే బ్రేక్ చేసి ఆధిపత్యం చాటాడు. అద్భుతమైన సర్వీస్‌లతో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా కేవలం 26 నిమిషాలలోనే తొలి సెట్‌ను 6-3తో సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో గిరాన్ నుంచి సురేష్‌కు గట్టి పోటీ ఎదురైంది. ఇద్దరూ 11వ గేమ్ వరకు తమ సర్వ్‌లను నిలబెట్టుకున్నారు. కీలక సమయంలో సురేష్ అద్భుతమైన పాయింట్ సాధించి మ్యాచ్‌పై పట్టు సాధించాడు. చివరిలో అద్భుతమైన స్మాష్‌తో సెట్‌ను 7-5తో గెలిచి తన తొలి ATP టూర్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.

డేవిస్ కప్‌లోనూ సత్తా

ఈ ఏడాది ప్రారంభంలో నెదర్లాండ్స్‌తో జరిగిన డేవిస్ కప్‌లో భారత్‌కు కీలక విజయాన్ని అందించి సురేష్ వార్తల్లో నిలిచాడు. అదే ఆత్మవిశ్వాసంతో విన్‌స్టన్-సేలమ్ ఓపెన్‌లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. మ్యాచ్ అనంతరం సురేష్ మాట్లాడుతూ స్వదేశీ అభిమానుల మద్దతు, తనకు పరిచయమైన వాతావరణం, కోర్టులు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపాడు. లక్కీ లూజర్‌గా మెయిన్ డ్రాలోకి రావడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడగలిగానని పేర్కొన్నాడు.

అరుదైన ఘనత

2019లో ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ తర్వాత విన్‌స్టన్-సేలమ్ ఓపెన్ మెయిన్ డ్రాలో మ్యాచ్ గెలిచిన రెండో భారతీయుడిగా 26 ఏళ్ల సురేష్ నిలిచాడు. అలాగే 2024 జులైలో సుమిత్ నగాల్ విజయం తర్వాత ATP టూర్ స్థాయిలో తొలి రౌండ్ మ్యాచ్ గెలిచిన తొలి భారత సింగిల్స్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తదుపరి రౌండ్‌లో సురేష్ అర్జెంటీనాకు చెందిన ఎనిమిదో సీడ్ జువాన్ మాన్యువల్ సెరుండోలోతో తలపడనున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>