కలం, వెబ్ డెస్క్: మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమెతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై క్రమ శిక్షణ కమిటీ రూపొందించిన నివేదికను ఛైర్మన్ మల్లు రవి, వైస్ ఛైర్మన్ శ్యాం మోహన్ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు అందించారు. ఈ నివేదికను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ పెద్దలకు మెయిల్ చేసినట్లు మల్లు రవి పేర్కొన్నారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి చర్యలకు కమిటీ సిఫార్సు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక వారిద్దరి విషయంలో అధిష్ఠానానిదే ఫైనల్ నిర్ణయమని పేర్కొంటున్నాయి. ఈ విషయంలో హై కమాండ్ కూడా సీరియస్‌గానే ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
కూతురి వ్యాఖ్యలతో చిక్కుల్లో..
సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపాయి. కూతురి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని కొండా సురేఖ క్రమ శిక్షణ కమిటీకి వివరణ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఆమెను కాపాడలేనంటూ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా చెప్పేయడంతో వేటు తప్పదనే సంకేతాలు బలంగా వస్తున్నాయి. మరోవైపు, చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం రేపింది. దీంతో మేఘారెడ్డి ఏకంగా ఢిల్లీకి వెళ్లి జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో.. వీరిద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.
Also Read : ఫార్మా కంపెనీల్లో ప్రమాద ఘంటికలు.. అధికారుల చర్యలేవి?
Follow Us On : WhatsApp

