కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా బైంసా (Bhainsa) టీజీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ బస్ డ్రైవర్లు 45 మంది ఏఐటీయూసీలో చేరారు. మంగళవారం ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. విలాస్ సమక్షంలో డ్రైవర్లకు కండువాలు కప్పి సంఘంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు విధానాలను ప్రభుత్వాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు గౌరవప్రదమైన వేతనాలు, సామాజిక భద్రత, కనీస పెన్షన్, గ్రాట్యుటీ, సెలవులు, వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు.
ఔట్సోర్సింగ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ అండగా ఉండి పోరాడుతుందని తెలిపారు. సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ఎన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎం.డీ ఫయాజ్, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్, ఔట్సోర్సింగ్ డ్రైవర్ల యూనియన్ నాయకులు సాయినాథ్, స్వామి, శ్రీనివాస్, దర్బార్ సింగ్, షకీల్ తదితరులు పాల్గొన్నారు.

