పంద్రాగస్టు నుంచి అమల్లోకి ‘గిగ్ వర్కర్’ చట్టం!

కలం, తెలంగాణ బ్యూరో: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ, క్యాబ్ సర్వీసులు, ఈ-కామర్స్ తదితర రంగాల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లకు (Gig Workers) సామాజిక భద్రత కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. శాసనసభ ఇప్పటికే ఆమోదించిన ‘తెలంగాణ ప్లాట్‌ఫాం ఆధారిత గిగ్ వర్కర్ల బిల్లు-2025’ అమలుకు సంబంధించి ఈ నెల 15 నుంచి నియమ నిబంధనలను అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో రాష్ట్రంలోని సుమారు 3 లక్షల మంది గిగ్ వర్కర్లకు సంక్షేమ పథకాలు, ఉద్యోగ భద్రత, బీమా వంటి ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి.

గిగ్ వర్కర్ల సంక్షేమ పథకాల అమలు, పర్యవేక్షణ కోసం శక్తి (స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్) శాఖ మంత్రి నేతృత్వంలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు కానుంది. దీని ద్వారా సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు గిగ్ వర్కర్ల హక్కుల పరిరక్షణకు చర్యలు మొదలుకానున్నాయి. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సంక్షేమ నిధి (వెల్ఫేర్ ఫండ్) ఏర్పాటవుతుంది. ప్లాట్‌ఫాం ఆధారిత సంస్థలు తప్పనిసరిగా తమ వాటాను ఈ నిధికి జమ చేయాల్సి ఉంటుంది.

అగ్రిగేటర్ల నుంచి 2 శాతం సంక్షేమ నిధికి పేమెంట్..

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న చట్టంతో, రూపొందించనున్న మార్గదర్శకాలతో గిగ్ వర్కర్లకు అగ్రిగేటర్లు చేసే చెల్లింపుల్లో 1-2 శాతం వరకు సంక్షేమ నిధికి బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ నిధి ద్వారా వర్కర్లకు బీమా, సామాజిక భద్రత, ఇతర సంక్షేమ పథకాలు అమలు కానున్నాయి. ఉద్యోగ భద్రతకు కూడా చట్టంలో ప్రాధాన్యత ఉండడంతో కనీసం వారం రోజుల ముందస్తు నోటీసు ఇవ్వకుండా గిగ్ వర్కర్లను తొలగించరాదనే నిబంధనను అమలవుతుంది.

వినియోగదారులపై గిగ్ వర్కర్లు శారీరక లేదా మానసిక వేధింపులకు పాల్పడితే కంపెనీలు వారిపై నేరుగా చర్యలు తీసుకోవచ్చు. ప్రభుత్వ పోర్టల్‌లో నమోదయ్యే ప్రతీ గిగ్ వర్కర్‌కు ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఐడీ జారీ అవుతుంది. దీని ఆధారంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ పొందుతారు. అగ్రిగేటర్లు ప్రతీ 60 రోజులకు ఒకసారి గిగ్ వర్కర్ల వివరాలను అప్‌డేట్ చేసి బోర్డుకు సమర్పించాల్సి ఉంటుంది. పేమెంట్స్, డిడక్షన్స్ లాంటి వివరాలను కూడా అగ్రిగేటర్లు పారదర్శకంగా వెల్లడించాల్సి ఉంటుంది.

చట్టాన్ని ఉల్లంఘిస్తే యాజమాన్యంపై ఫైన్..

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే చట్టాన్ని ఉల్లంఘించే సంస్థలు లేదా నిబంధనలను పాటించని ప్లాట్‌ఫాం నిర్వాహకులపై రూ. 50 వేల వరకు జరిమానా విధించే నిబంధనలున్నాయి. గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి గతేడాది డిసెంబర్‌లోనే ప్లాట్‌ఫాం కంపెనీలు, కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. కార్మిక శాఖ ముసాయిదా బిల్లును విడుదల చేసి ప్రజలు, అగ్రిగేటర్లు, ప్లాట్‌ఫాం సంస్థల నుంచి వచ్చిన 250కి పైగా సూచనలు, అభ్యంతరాలను ప్రభుత్వం పరిశీలించింది.

అభిప్రాయాలకు అనుగుణంగా బిల్లులో కొన్ని మార్పులు చేసింది. ఆ తర్వాత శాసనసభ ఆమోదంతో చట్టం రూపొందింది. ఇప్పుడు అమలు దశకు చేరుకుంది. ఈ చట్టం అమల్లోకి రావడంతో కర్ణాటక, ఝార్ఖండ్, రాజస్థాన్, బిహార్ తర్వాత గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేక చట్టాన్ని అమలు చేస్తున్న దేశంలోని ఐదో రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. రోజువారీ ఆర్డర్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్న లక్షలాది గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించడంలో ఈ చట్టం కీలక మైలురాయిగా నిలుస్తుందన్నది ప్రభుత్వం భావన.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>