కలం, హైదరాబాద్ : చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆపేది లేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) అన్నారు. వచ్చే బడ్జెట్ సెషన్‌లోపు బీసీ బిల్లు పాస్ చేసి పంపించాలని అల్టిమేటం జారీ చేశారు. లేదంటే ఛలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో గురువారం ఏర్పాటు చేసిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో కవిత మాట్లాడారు.
సామాజిక న్యాయ తెలంగాణ కోసం తన జీవితాన్నే అంకితం చేస్తున్నని అన్నారు. సమాజంలోని అట్టడుగు, అణగారిన వర్గాల్లో సాధికారిత వచ్చే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తాము చేపట్టిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ కచ్చితంగా కొట్లాది మంది జీవితాల్లో మార్పు తెస్తుందని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కే విధంగా గ్రామ గ్రామనా తమ పార్టీ శ్రేణులు పోరాటం చేస్తారని తెలిపారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 6 న నాటికి సామాజిక న్యాయ తెలంగాణ పోరాటంలో పురోగతిని సమీక్షించుకుంటామన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్న వారందరితో కలిసి పనిచేస్తామని కవిత ఈ సందర్భంగా ఈ స్పష్టం చేశారు.
రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ బీసీలకు మోసం చేసింది
రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు మోసం చేసిందని కవిత విమర్శించారు. 46 శాతం బీసీలు, 10 శాతం బీసీ ముస్లింలు ఉంటే 42 శాతం మాత్రమే రిజర్వేషన్లు అంటూ వింత లెక్కలు ప్రతిపాదించిందన్నారు. పైగా బీసీ రిజర్వేషన్ల బిల్లును అమలు కాకుండా డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రేమ లేఖలు రాసుకుంటూ గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్న విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం పొందేలా కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు ఎందుకు కలిసి పనిచేయరంటూ కవిత ప్రశ్నించారు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు సహా ఎస్సీ, ఎస్టీలకు వారి నిధులు వారి అభ్యున్నతికే ఖర్చు చేయాలన్నారు. ముస్లింలను కేవలం మాటలతోనే అన్ని రాజకీయ పార్టీలు మోసం చేశాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మాటలతో కడుపు నిండదని వారికి న్యాయం చేయాలని కోరారు. ముస్లింలు తమతో కలిసి రావాలని కవిత పిలుపునిచ్చారు.
సామాజిక న్యాయ తెలంగాణ కోసం ప్రతిజ్ఞ
సామాజిక న్యాయ తెలంగాణ సాధనే లక్ష్యంగా అన్ని వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక స్వావలంబన కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఆమె ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సామాజిక న్యాయానికి సంబంధించిన 11 కీలక తీర్మానాలను కవిత ప్రతిపాదించగా, సభికులు ఏకగ్రీవంగా ఆమోదించారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు దేశవ్యాప్తంగా కలిసి వచ్చే శక్తులతో టీఆర్ఎస్ ఉద్యమిస్తుందని కవిత ప్రకటించారు.
మహాత్మా జ్యోతిరావ్ పూలే, సావిత్రి బాయి పూలే దంపతులుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రొఫెసర్ జయశంకర్‌కు పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని, హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే నిధులను పూర్తిగా వారి సంక్షేమానికే వినియోగించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.
ఆదివాసీలకు అడవులపై సంపూర్ణ హక్కులు కల్పించాలని, డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తీర్మానించారు. ముస్లింల ఆర్థిక స్వావలంబనకు చర్యలు చేపట్టడంతో పాటు వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీసుకురావాలని, సిక్కులు, క్రైస్తవుల ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాన్స్‌జెండర్లకు సంపూర్ణ హక్కులు కల్పించాలని, వికలాంగులకు హామీ ఇచ్చిన మేరకు పెన్షన్లు పెంచడంతో పాటు కో-ఆప్షన్ సభ్యుల నియామకాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని తీర్మానించారు. ఈ తీర్మానాలన్నింటికీ సభలో పాల్గొన్న ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

