కలం, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వీబీజీ-రామ్‌జీ (ఇంతకాలం గ్రామీణ ఉపాధి హామీ) చట్టం జులై 1 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్త చట్టం ప్రభావంతో రాష్ట్రానికి కలిగే ఆర్థిక, సామాజిక, ఉపాధిపరమైన ప్రభావాలను అంచనా వేస్తూ ప్రత్యామ్నాయ కార్యాచరణపై ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. గ్రామీణ ఉపాధి హక్కులకు భంగం కలగకుండా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని మార్గాలనూ పరిశీలిస్తున్నట్లు గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో సోమవారం సీతక్క సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
కొత్త చట్టంలోని ప్రధానమైన అంశాలను, నిబంధనలను అధికారులు వివరించారు. ప్రస్తుతం అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పోలిస్తే కొత్త చట్టంలో కీలక మార్పులే ఉన్నాయన్నారు. వ్యవసాయ సీజన్‌లలో 60 రోజుల పాటు ఉపాధి పనులను నిలిపివేయాల్సి రావడం, రాష్ట్రాలకు ముందుగా నిర్దేశిత నిధుల కేటాయింపు విధానాన్ని అమలు చేయడం, కేంద్ర-రాష్ట్ర వ్యయ భాగస్వామ్యాన్ని 60:40 నిష్పత్తికి మార్చడం వంటివి తెలంగాణపై ప్రభావం చూపే అవకాశముందని ఈ సమావేశంలో చర్చ జరిగింది.
ఉపాధి అవకాశాలు తగ్గకుండా చర్యలు..
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం లక్షలాది కుటుంబాలకు జీవనాధారంగా మారిన నేపథ్యంలో కొత్త చట్టం కారణంగా ఉపాధి అవకాశాలు తగ్గకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. కార్మికులకు డిమాండ్ మేరకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించే విధానాన్ని కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యామ్నాయాలను అధికారులు వివరించారు. అవసరమైతే రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం, కేంద్రం నిర్ణయించే నార్మేటివ్ కేటాయింపులకు మించి అవసరమయ్యే నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించడం, కేంద్ర-రాష్ట్ర వ్యయ భాగస్వామ్య విధానంలో మార్పులు కోరడం వంటి ప్రతిపాదనలపై పరస్పరం చర్చించుకున్నారు.
ఆ విధానాలను అధ్యయనం చేయాలి..
కర్ణాటక, కేరళం, జార్ఖండ్ రాష్ట్రాలు వీబీజీ-రామ్‌జీ చట్టంపై తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న వ్యూహాలను పరిశీలించాలని, అక్కడ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సీతక్క సూచించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ పేదల ఉపాధి, జీవనోపాధి ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. తెలంగాణలో ఉపాధి హామీ పథకం కేవలం సంక్షేమ కార్యక్రమం మాత్రమే కాకుండా లక్షలాది కుటుంబాల ఆర్థిక భద్రతకు ఆధారంగా నిలిచే కార్యక్రమంగా ప్రభుత్వం చూస్తున్నదన్నారు. కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే ఏ నిర్ణయాన్నీ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించదని పేర్కొన్నారు.

