కలం, వెబ్‌డెస్క్: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలిశారు. ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా పర్యావరణ అనుమతులు, అటవీ సంరక్షణ చర్యలు, రాష్ట్రంలో చేపడుతున్న ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను సీఎం రేవంత్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన అనుమతులు వేగంగా మంజూరు చేయాలని, పర్యావరణ పరిరక్షణతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగేలా సహకరించాలని సీఎం రేవంత్ కోరారు.
మరోవైపు కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో కూడా సీఎం రేవంత్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులు, రహదారులకు అనుమతులు ఇవ్వాలని ఆయనను కోరారు. పాలమూరు రంగారెడ్డి, సీతమ్మ సాగర్, డిండి, గౌరవెల్లికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని విన్నవించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కేంద్రం జోక్యం చేసుకోవాలని సీఎం కోరారు. మహారాష్ట్రతో చర్చలు జరిపేందుకు సహకరించాలని అడిగారు. గ్రావిటీతో నీటి సరఫరా సాధ్యమని సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు. 150 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మించేందుకు సీఎం ప్రతిపాదనలు సమర్పించారు.

