కలం, వెబ్ డెస్క్: క్యాబ్ డ్రైవర్‌ను చితకబాదిన ఘటనలో సినీ నటుడు సుప్రీత్ రెడ్డి (అలియాస్ కాట్రాజ్) వివాదంలో చిక్కుకొన్నారు. తనపై సుప్రీత్ రెడ్డి దాడి చేశారంటూ ఓ క్యాబ్ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కీసర పోలీస్ స్టేషన్‌లో సుప్రీత్ పై కేసు నమోదు అయ్యింది. శ్రీహరి అనే క్యాబ్ డ్రైవర్ ఆదివారం తన ట్రిప్ పూర్తి చేసుకొని మరో బుకింగ్ కోసం నాగారం చౌరస్తాలో రోడ్డు పక్కన కారు నిలిపాడు. అదే సమయంలో అక్కడికి కారులో వచ్చిన సుప్రీత్ రోడ్డుకు అడ్డంగా ఉన్నావని ఆగ్రహంతో క్యాబ్ డ్రైవర్ శ్రీహరితో గొడవకు దిగారు.
‘నా కారుకి అడ్డంగా ఉన్నావ్.. కారు తీయ్’ అంటూ శ్రీహరిపై సుప్రీత్ రెడ్డి దుర్భాషలాడినట్లు బాధితుడు పేర్కొన్నాడు. మాటా మాటా పెరగటంతో తనను చితకబాదినట్లు క్యాబ్ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే బాధితుడు 100కు డయల్ సమాచారం అందించి, కీసర పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. సుప్రీత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని బాధితుడి కోరుతున్నాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సినిమాల్లో కరుడుగట్టిన రౌడీ, విలన్ పాత్రలను సుప్రీత్ రెడ్డి చేశారు. ఛత్రపతిలోని కాట్రాజ్ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నారు. మర్యాద రామన్న, సాహో, ఆనందో బ్రహ్మ, పుష్ఫ, సరిపోదా శనివారం, రాజాసాబ్ లాంటి చిత్రాల్లో సుప్రీత్ నటించారు.

