కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయ, తాగునీటి విద్యుత్ అవసరాల కోసం ప్రత్యేకంగా మూడో విద్యుత్ పంపిణీ సంస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGRPDCL)’ పేరిట రైతు డిస్కం (Rythu Discom) ఏర్పాటు చేస్తూ ఇంధన శాఖ కీలకమైన ‘స్టాట్యూటరీ ట్రాన్స్‌ఫర్ స్కీమ్’ కింద జీఓ 17ను జారీ చేసింది. ఈ నూతన విధానం ద్వారా వ్యవసాయం, మిషన్ భగీరథ, ఎత్తిపోతల పథకాలు, తాగునీటి సరఫరా విభాగాలన్నింటినీ ఇకపై పూర్తిగా TGRPDCL పరిధిలోకి బదిలీ చేశారు.
ఈ కొత్త డిస్కం పరిధిలోకి మొత్తం 30.62 లక్షల విద్యుత్ కనెక్షన్లను కేటాయించగా, అందులో 30.60 లక్షలు కేవలం వ్యవసాయ కనెక్షన్లే కావడం గమనార్హం. అంతేకాకుండా 6.15 లక్షల వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు, 2.51 లక్షల కిలోమీటర్ల ఎల్‌టీ లైన్ల బాధ్యతను కూడా ఈ సంస్థకు అప్పగించారు. రైతు డిస్కం ప్రారంభ నిర్వహణ కోసం ప్రభుత్వం 2,000 మంది సిబ్బందిని కేటాయించడంతో పాటు, TGRPDCLలోకి మారే విద్యుత్ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ప్రమోషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇక సంస్థ సమర్థవంతంగా నడిచేందుకు భారీగా పునరుత్పాదక ఇంధన వనరుల (సోలార్, హైడల్) తో పాటు థర్మల్ విద్యుత్ కేంద్రాల వాటాలను కేటాయించారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన రూ.46,155 కోట్ల బకాయిలను, రూ.46,126 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణాలను రైతు డిస్కంకు బదిలీ చేశారు. అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల విద్యుత్ అవసరాలను వేరుచేసి నిర్వహించడం ఉచిత విద్యుత్ పథకానికి విఘాతం కలిగించేలా ఉందంటూ పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

