కలం, నిర్మల్: అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడుస్తున్నా.. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు మాత్రం పదవుల పండుగ రావడం లేదు. దసరా నాటికి పదవుల భర్తీ ఉంటుందని ఆశలు రేపారు.. దీపావళి నాటికైనా ప్రకటన వస్తుందని ఎదురుచూశారు. ఆ రెండు పండుగలు గడిచిపోయినా కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి స్పష్టత కరువైంది. ఇప్పుడు ఆశావహుల చూపులన్నీ సంక్రాంతిపై పడుతున్నాయి. కనీసం సంక్రాంతి నాటికైనా నామినేటెడ్ పదవుల పంపకం పూర్తవుతుందా లేక మరోసారి వాయిదా పడుతుందా? అన్న చర్చ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ (Nirmal Congress) వర్గాల్లో జోరుగా సాగుతోంది. పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నాయకులు, కార్యకర్తల్లో రోజురోజుకూ అసహనం పెరుగుతోంది. మరోవైపు పార్టీలో అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలు పదవుల పంపకానికి ప్రధాన అడ్డంకిగా మారాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పదవుల కోసం పోటాపోటీ.. ఎవరి లెక్కలు వారివే..
2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన నాయకులు, కార్యకర్తల్లో పదవులపై ఆశలు చిగురించాయి. వివిధ నామినేటెడ్ పోస్టుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయంగా చైతన్యం కలిగిన నిర్మల్ జిల్లాలో ఈ పదవుల భర్తీ వ్యవహారం మరింత సంక్లిష్టంగా మారింది. జిల్లాలో ఖానాపూర్ ఎమ్మెల్యేగా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు లేకపోవడంతో పార్టీ ఇన్చార్జుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఆధిపత్య పోరు తెరపైకి వస్తోంది. నిర్మల్ నియోజకవర్గంలో పార్టీ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి వర్గాలుగా నాయకులు తమ తమ రాజకీయ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారన్న చర్చ సాగుతోంది. తమకు అనుకూలమైన వారికి పదవులు దక్కేలా అధిష్ఠానం వద్ద ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం కొరవడటంతో పదవుల పంపకం కొలిక్కి రావడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముధోల్ నియోజకవర్గంలో పార్టీ ఇన్చార్జి నారాయణరావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వర్గాల మధ్య పోటీ కొనసాగుతోంది. ఖానాపూర్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండటంతో ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే పరిస్థితి కొంత భిన్నంగా ఉన్నప్పటికీ అక్కడా పాత, కొత్త నాయకుల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయన్న చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
పదవులు కొందరికేనా.. కార్యకర్తలకు దక్కేదెప్పుడు..
జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీఎంఎస్, బాసర, అడెల్లి ఆలయ కమిటీ తదితర నామినేటెడ్ పదవుల కోసం ఆశావహులు తమ తమ నాయకుల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని పనిచేసిన తమకు గుర్తింపు దక్కడం లేదని కొందరు సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పటికీ పదవుల భర్తీలో జాప్యం చేయడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు కట్టబెడితే వారు మరింత ఉత్సాహంతో పనిచేయడంతో పాటు గ్రామస్థాయిలో కార్యకర్తలకు అండగా నిలుస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అసలైన కార్యకర్తలకు అవకాశం దక్కుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వేణుగోపాలాచారి రాకతో కొత్త సమీకరణాలు..
ఇటీవల రాజకీయంగా కొంతకాలం తటస్థంగా కనిపించిన మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి నిర్మల్, భైంసా ప్రాంతాల్లో పర్యటిస్తూ తన అనుచర వర్గాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శితో పాటు పట్టణానికి చెందిన పలువురు యువ నాయకులు ఆయనకు దగ్గరవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలు నామినేటెడ్ పదవుల కేటాయింపులో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఉన్న గ్రూపులకు తోడు కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తే పదవుల పంపకం మరింత జటిలమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
వలస నేతలకు పదవులొద్దు.. పాత నేతల పట్టుదల..
ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాయకులకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టవద్దని పాత కాంగ్రెస్ నాయకులు పట్టుబడుతున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. పదేళ్లపాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, అధికారం మారిన తర్వాత కాంగ్రెస్‌లో చేరిన వారికి మళ్లీ పదవులు ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని కష్టకాలంలో అంటిపెట్టుకుని పనిచేసిన తమకు ప్రాధాన్యత ఇవ్వాలని, మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికే నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామం పదవుల కేటాయింపుపై కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తికి కారణమవుతోంది. ఇటీవల ఉమ్మడి జిల్లా నాయకులతో ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేకంగా సమావేశమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులకు సూచించారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి నామినేటెడ్ పదవులు, తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారాన్ని, పదవులను అనుభవించి, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకు మళ్లీ నామినేటెడ్ పదవులు కట్టబెట్టవద్దన్న డిమాండ్ పార్టీ పాత కార్యకర్తల నుంచి బలంగా వినిపిస్తోంది.
ఎన్నికలకు ఏడాదిన్నరే.. ఇప్పటికైనా మేల్కొంటారా..
మరోవైపు సర్పంచ్ ఎన్నికలు పూర్తయినా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులు కూడా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే తమకు గుర్తింపు దక్కకపోతే భవిష్యత్తులో అవకాశాలు ఎప్పుడు వస్తాయని ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడిచిపోయాయి. మరో ఏడాదిన్నరలో ఎన్నికల వాతావరణం మొదలయ్యే అవకాశం ఉంది. ఈ తరుణంలో నామినేటెడ్ పదవుల భర్తీతో నాయకులకు బాధ్యతలు అప్పగించి, కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేయాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. జిల్లాలో గ్రూపు విభేదాలు లేవని పార్టీ నాయకత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న చర్చ బహిరంగంగానే సాగుతోంది. ఇప్పటికైనా అధిష్ఠానం జోక్యం చేసుకుని నాయకుల మధ్య సమన్వయం సాధించి సంక్రాంతిలోపు పదవుల భర్తీకి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే పార్టీకి రాజకీయంగా నష్టం తప్పదని పలువురు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

