కలం, కరీంనగర్ బ్యూరో: సొంత ఇల్లు లేక, అద్దె కట్టలేక శ్మశానమే నివాసంగా మార్చుకుని అనారోగ్యంతో ఉన్న కొడుకుతో దుర్భర జీవితం గడుపుతున్న ఓ నిరుపేద మహిళ కష్టాలకు ఎట్టకేలకు తెరపడింది. చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన మర్రిపల్లి అమృత దీనస్థితిపై అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు మానవతా దృక్పథంతో స్పందించి ఆమెకు ఇందిరమ్మ ఇల్లు(Indiramma House) మంజూరు చేశారు.
బతుకుదెరువు కోసం నిజామాబాద్ వెళ్లిన అమృత.. నాలుగేళ్ల క్రితం కొడుకు వైద్యం కోసం వేములవాడకు వచ్చారు. ఉండటానికి నీడ లేక శ్మశానంలో తలదాచుకుంటున్న ఆమె పరిస్థితిని తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చలించిపోయారు. తక్షణ సాయంగా రూ. 50 వేలు పంపడంతో పాటు, జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్‌కు ఫోన్ చేసి అమృతకు ఇల్లు మంజూరు చేయాలని కోరారు.
అంతకుముందే అధికారులతో అమృత వివరాలను ఆరా తీసిన కలెక్టర్ గరీమా అగర్వాల్.. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆమెకు ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని అందజేశారు. వేములవాడ 12వ వార్డులోని తనకున్న 60 గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకుంటానని అమృత తెలిపారు. మరోవైపు, అమృత ఇంటికి అవసరమైన సామాగ్రితో పాటు నిత్యావసర సరుకులు అందించి అండగా నిలవాలని బండి సంజయ్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. తన కష్టాలను తీర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్‌కు, అండగా నిలిచిన కేంద్ర మంత్రికి అమృత కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి హౌసింగ్ పీడీ సాజిద్, మున్సిపల్ కమిషనర్ లోకేష్ పాల్గొన్నారు.

