కలం, మెదక్ బ్యూరో: ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ డిమాండ్ (Medak Power Demand) ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయికి చేరింది. దానికి తగినట్లుగా సరఫరా లేకపోవడంతో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేళాపాళా లేని కరెంట్ కోతలతో పొలాలకు సరిగా నీరందక పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు లో వోల్టేజ్ సమస్యలతో మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. పొట్ట దశలోని వరితోపాటు ఇతర పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టంతోపాటు మోటార్ల రిపేర్లతో తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డిమాండ్‌కు తగ్గట్లుగా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.
కాలిపోతున్న మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు
మెదక్ జిల్లాలో నాణ్యత లేని విద్యుత్ సరఫరా, లో వోల్టేజ్ సమస్యల వల్ల మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటున్నాయి. ఒక్కో మోటార్ రిపేరుకు రైతులపై పది వేల రూపాయల వరకు అదనపు భారం పడుతున్నది. 11 కేవీ లైన్‌పై ఉండాల్సిన దానికంటే వోల్టేజ్ పడిపోవడమే దీనికి ప్రధాన కారణం. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కేవలం 7 నుంచి 8 గంటలు మాత్రమే వస్తోందని, మధ్యమధ్యలో ట్రిప్పింగ్ ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నాణ్యత లేని కరెంట్ కారణంగా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే మార్చడానికి సబ్ స్టేషన్లలో అదనపు నిల్వలు లేవు. పాతది తీసుకెళ్లి రిపేరు అయ్యే వరకు నిరీక్షించాల్సి వస్తోందని, ఆ సమయంలో నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు.
గతేడాతో పోలిస్తే రెట్టింపు డిమాండ్
ఎల్ నినో ప్రభావం, వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉమ్మడి జిల్లాలో విద్యుత్ అవసరం గణనీయంగా పెరిగింది. గతేడాది అక్టోబర్‌లో 282 మెగావాట్లుగా ఉన్న డిమాండ్, ఈసారి అదే నెలలో 567 మెగావాట్లకు చేరింది. అంటే డిమాండ్ సరిగ్గా రెట్టింపైంది. వ్యవసాయ, గృహ అవసరాలకు తగినట్లుగా ముందస్తు ప్రణాళికతో సరఫరా వ్యవస్థను బలోపేతం చేశామని జిల్లా ఎస్ఈ నారాయణ నాయక్ తెలిపారు. కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సబ్స్టేషన్ల వద్ద వోల్టేజ్ మెరుగుపరచడానికి హైదరాబాద్ నుంచి 172 ఎంవీఏఆర్ కెపాసిటర్ బ్యాంకులను తెచ్చి బిగించామని, పంటలు ఎండిపోకుండా కరెంట్ ఇస్తున్నామని స్పష్టం చేశారు.
20 గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్
అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో సమస్యలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. ప్రస్తుతం వరితోపాటు ఇతర పంటలు పొట్ట దశకు రావడంతో నీటి అవసరం ఎక్కువగా ఉంది. ఎండల తీవ్రత దృష్ట్యా రాత్రి పూట విద్యుత్‌ను కూడా కలుపుకుని కనీసం 20 గంటల నాణ్యమైన, లో వోల్టేజ్ లేని కరెంటును అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

