కలం, వెబ్ డెస్క్ : పాకిస్తాన్‌లోని (Pakistan Aircraft Crash) బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా సమీపంలో విషాదం చోటుచేసుకుంది. పాకిస్తాన్ సైన్యానికి చెందిన ‘మొషాక్’ శిక్షణా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో క్వెట్టాలోని నవాన్ కిల్లీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు సైనిక పైలట్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదంలో ఇన్‌స్ట్రక్టర్ పైలట్ మేజర్ హుస్నైన్ షెహజాద్ హుమాయున్ తో పాటు స్టూడెంట్ పైలట్ కెప్టెన్ అబ్దుల్ సమద్ మరణించినట్లు పాకిస్తాన్ ఆర్మీ సమాచార విభాగం వెల్లడించింది.
సాధారణ శిక్షణలో భాగంగా గాల్లోకి లేచిన కొద్దిసేపటికే విమానం అదుపుతప్పి సమీపంలోని బహిరంగ ప్రదేశంలో పడిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఈ ఘోర విషాదం చోటు చేసుకుందని పాకిస్తాన్ ఆర్మీ సమాచార విభాగం పేర్కొంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై పలువురు సైనిక అధికారులు, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

