Mobile Popup Ad
Mobile Popup Ad

పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

కలం, చండూరు : మునుగోడు నియోజకవర్గంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి, వచ్చే పది రోజుల్లో కల్లాల్లో ఉన్న మొత్తం ధాన్యాన్ని కొనుగోలు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) అధికారులను ఆదేశించారు. మంగళవారం మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో లారీల కొరత, హమాలీల సమస్యలు, గోదాముల కొరత వంటి అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

నల్గొండ జిల్లా పరిధిలోని మునుగోడు, చండూరు, ఘట్టుప్పల్, నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో గత ఏడాది 2,85,560 క్వింటాళ్ల ధాన్యం సేకరణ జరగగా, ఈసారి 4,20,430 క్వింటాళ్ల దిగుబడి నమోదైందని అధికారులు వివరించారు. ఇప్పటివరకు 3,52,300 క్వింటాళ్లు కొనుగోలు చేయగా, ఇంకా 68,130 క్వింటాళ్ల ధాన్యం కల్లాల్లో ఉందన్నారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల్లో కూడా గత ఏడాదితో పోలిస్తే రెండింతలకుపైగా దిగుబడి వచ్చిందని తెలిపారు. ఇప్పటివరకు 2,36,215 క్వింటాళ్ల ధాన్యం సేకరించగా, ఇంకా పెద్ద మొత్తంలో కొనుగోలు జరగాల్సి ఉందన్నారు.

రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హమాలీలకు ప్రభుత్వం చెల్లించే కూలీకి అదనంగా రూ.10,20,000 తన సొంత నిధుల నుంచి చెల్లిస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. హమాలీల కొరత కారణంగా కొనుగోళ్లు ఆలస్యం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా నియోజకవర్గ వ్యాప్తంగా భారీ గోదాముల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. మునుగోడు – 2 లక్షల క్వింటాళ్లు, నాంపల్లి – 1 లక్ష , నారాయణపూర్ – 2 లక్షలు, చౌటుప్పల్ – 4 లక్షల క్వింటాళ్లు మొత్తం 9 లక్షల క్వింటాళ్ల నిల్వ సామర్థ్యంతో గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.

స్థానికంగా పండిన ధాన్యాన్ని స్థానికంగానే నిల్వ చేసే విధంగా శాశ్వత ప్రణాళిక రూపొందించాలని, ప్రతి మండలాన్ని యూనిట్‌గా తీసుకుని ముందస్తు అంచనాలతో చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో నల్గొండ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, చండూరు ఆర్డీవో శ్రీదేవి, చౌటుప్పల్ ఆర్టీవో శేఖర్ రెడ్డి, డీసీవోలు, సివిల్ సప్లై అధికారులు, ఎమ్మార్వోలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>