కలం, మహబూబ్ నగర్ బ్యూరో: గిరిజన, ఆదివాసీలు అనాదిగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం తక్షణమే పట్టాలు ఇవ్వాలని తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సురవరం వెంకట్రామారెడ్డి భవన్ లో గిరిజన సమాఖ్య (Telangana Girijana Sangham) జిల్లా మూడవ మహాసభలు ఎన్.శంకర్ నాయక్ అధ్యక్షతన జరిగాయి. ముందుగా మహాసభల ప్రారంభ సూచకంగా గిరిజన సమాఖ్య జెండాను ఆవిష్కరించారు.
కేంద్రంపై ఫైర్..
తెలంగాణ గిరిజన సమాఖ్య (Telangana Girijana Sangham) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్ ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గిరిజన ఆదివాసుల భూములపై వారి జీవన విధానానికి ఆధారమైన అడవులపై కన్నేసిందని అందులో భాగంగానే సహజ సంపదను కొల్లగొట్టి కార్పొరేట్ గద్దలకు కట్టబెడుతున్నాదని ఆరోపించారు. తిరగబడుతున్న ఆదివాసి గిరిజనులు తెగలపై దేశద్రోహులుగా, అసాంఘిక శక్తులుగా ముద్రవేసి అడవుల నుండి వెళ్లగొడుతున్నారని ద్వజమెత్తారు.
గిరిజన సంక్షేమాన్ని గాలికొదిలేసిన కాంగ్రెస్..
మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడ గిరిజన సంక్షేమం గాలికి వదిలేసిందని ఆరోపించారు. గిరిజనులకు జీవనోపాధి లేక దేశాంతరాలకు వలసలు వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చేవెళ్ల గిరిజన డిక్లరేషన్ తక్షణమే అమలు చేయాలని, సంక్షేమ పథకాల్లో గిరిజనులకు తొలి ప్రాధాన్యం కల్పించాలని, గిరిజన గూడెలు,తాండల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, గిరిజన విద్య, వైద్య వ్యాప్తికి 1000 కోట్ల నిధులు మంజూరు చేయాలని, పెండింగ్ లో ఉన్న గిరిజన సబ్సిడీ రుణాల నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి బృంగీ బాలకిషన్ మాట్లాడుతూ.. గిరిజనులు, సామాజిక, ఆర్థిక రాజకీయంగా చైతన్యవంతమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలపై తిరుగుబాటుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా గిరిజనులు నెట్టి వేయబడుతున్నారని ఆరోపించారు. గిరిజనులపై రోజురోజుకు దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు పెరిగి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నూతన జిల్లా సమితి ఎన్నిక..
తెలంగాణ గిరిజన సమాఖ్య మహబూబ్ నగర్ జిల్లా మూడవ మహాసభలో నూతన జిల్లా అధ్యక్షులుగా ఎన్.శంకర్ నాయక్, ఉపాధ్యక్షులుగా డి.రాజు నాయక్, జే.జగ్గానాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా డి.సంజీవ్ నాయక్, జిల్లా సహాయ కార్యదర్శుగా కే.రాము నాయక్, ఎం. నాగ్యనాయక్, కోశాధికారిగా వి. వెంకటేష్ నాయక్, జిల్లా సమితి సభ్యులుగా పరుష నాయక్, కృష్ణయ్య నాయక్ లతో మరో ఆరుగురు కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు.
Read Also: కాంగ్రెస్ ‘సీక్రెట్’ సర్వే.. వారిపై స్పెషల్ ఫోకస్!
Follow Us On: Instagram

