కలం, సూర్యాపేట : రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న నీళ్లు, కరెంట్ కొరత సహజసిద్ధంగా వచ్చిన కరువు కాదని, అది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం వల్ల సంభవించిన మానవ నిర్మిత కరువు అని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గోదావరిలో వేలాది క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నా.. ప్రభుత్వం మాత్రం సూర్యాపేట ఆయకట్టుకు నీళ్లివ్వకుండా పంటలను ఎండబెడుతోందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని తరలించే వ్యవస్థలన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం మూర్ఖపు పట్టుదలతో రైతుల పొలాలను ఎండబెడుతోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు.
‘గతంలో కేసీఆర్ హయాంలో వరసగా తొమ్మిది పంటలకు సమృద్ధిగా నీళ్లిచ్చాం. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఒక్క పంటకు కూడా నీళ్లివ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది. నీళ్లు విడుదల చేస్తే కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందో, తమ పరువు ఎక్కడ పోతుందోననే భయంతోనే కాంగ్రెస్ పాలకులు నీటిని విడుదల చేయడం లేదు. లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నా సీఎం, మంత్రులు నిద్రావస్థలో ఉన్నారు’ అని నిలదీశారు.
పంటలను కాపాడటానికి తక్షణమే కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ప్రారంభించి, రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, రోజుకు 12 నుంచి 13 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 2014 కంటే ముందున్న చీకటి రోజులు మళ్లీ పునరావృతములున్నాయని విమర్శించారు.
పొలాల్లో ఎక్కడ చూసినా బోరింగ్ రిగ్గులే కనిపిస్తున్నాయని, రైతులు అప్పులు చేసి బోర్లు వేస్తున్నా కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరెంట్ కొనుగోలు చేయడానికి నిధులు ఖర్చవుతాయనే నెపంతోనే ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరాను బంద్ చేసిందని, ఇది రైతులను నిలువునా ముంచడమేనని అన్నారు. ప్రభుత్వ దుర్మార్గపు వైఖరిని ఎండగట్టేందుకు ప్రజలు, రైతులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల తిరుగుబాటు తప్పదని, ఆ పోరాటం సూర్యాపేట గడ్డ నుంచే ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ‘బుల్లెట్ ట్రైన్’ ప్రాజెక్టు అలైన్మెంట్ మార్పుపై జగదీష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శంషాబాద్ నుంచి నల్గొండ, సూర్యాపేట మీదుగా చెన్నై వరకు గతంలో ప్రతిపాదించిన బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని వేరే వైపు మళ్ళించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పునరాలోచించాలని కోరారు. జిల్లా అభివృద్ధికి కీలకమైన ఈ ప్రాజెక్ట్ సూర్యాపేట మీదుగానే వెళ్లేలా ఇక్కడి కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమ ప్రభుత్వాలను ఒప్పించాలని సూచించారు. ఈ విషయంలో తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.

