తెలంగాణలో బీజేపీకి పుట్టగతులుండవ్ : విప్ వేముల వీరేశం

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు పూర్తవుతున్నా ఈ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ (BJP) ఇంకా విషం చిమ్ముతూనే ఉన్నదని, రాబోయే రోజుల్లో ఆ పార్టీకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పక తప్పదని ప్రభుత్వ విప్ వేముల వీరేశం (Vemula Veeresham) వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచీ బీజేపీ సందర్భం వచ్చినప్పుడల్లా నెగెటివ్ కామెంట్లు చేస్తూనే ఉన్నదని, అందుకు ప్రధాని మోదీ “తల్లిని చంపి బిడ్డను బతికించి..” అని చేసిన కామెంట్లే నిదర్శనమన్నారు. అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని గతంలో చేసిన విష ప్రచారానికి కొనసాగింపుగా నిన్ననే లోక్‌సభలో కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణను ఏర్పాటు చేసే ప్రక్రియను భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం యావత్తు తెలంగాణ ప్రజల పోరాటం, ఉద్యమస్ఫూర్తి, ఆకాంక్షలు, అమరుల త్యాగాన్ని అవమానించడమేనని అన్నారు.

తెలంగాణ వ్యతిరేకిగా కిషన్‌రెడ్డి తీరు

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (Tejasvi Surya) లోక్‌సభ వేదికగా చేసిన కామెంట్లపై బీజేపీ తన విధానమేంటో వివరించాలని విప్ వేముల వీరేశం (Vemula Veeresham) డిమాండ్ చేశారు. తెలంగాణ విభజన ప్రక్రియను తేజస్వి అవమానిస్తూ కామెంట్లు చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న తెలంగాణ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు ఇప్పుడు కేంద్ర మంత్రులుగా ఉన్న ఇద్దరికి, మరో ఆరుగురు ఎంపీలకు కూడా ఇష్టం లేదా అని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) మొదటి నుంచీ తెలంగాణ వ్యతిరేకిగానే ఉన్నారని, రాష్ట్ర సాధన కోసం ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు చాలామంది మంత్రి పదవులకు, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినా కిషన్‌రెడ్డి మాత్రం పారిపోయారని వేముల వీరేశం ప్రస్తావించారు. ‘ఒక ఓటు – రెండు రాష్ట్రాలు’ అంటూ బీజేపీ కాకినాడలో చేసిన తీర్మానం చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నా తేజస్వి సూర్య సహా ప్రధాని మోడీ, అమిత్ షా ఇప్పుడు తెలంగాణపై ఎందుకు విషం చిమ్ముతున్నారని ప్రశ్నించారు.

తేజస్వి వ్యాఖ్యలపై బీజేపీ వైఖరేంటి

తెలంగాణ ప్రజలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించిన పాపానికి ఇప్పుడు అవమానాలు ఎదుర్కొంటున్నారని విప్ వేముల వీరేశం వ్యాఖ్యానించారు. అరవై ఏండ్లుగా జరిగిన తెలంగాణ ఉద్యమాన్నే తేజస్వి అవమానించారని అన్నారు. ఆయన కామెంట్లు యావత్తు తెలంగాణ సమాజాన్ని, 1200 మంది అమరుల త్యాగాన్ని అవమానించడమేనని అన్నారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై బీజేపీ వైఖరేంటని ప్రశ్నించారు. కాకినాడ తీర్మానం నుంచి ‘యూ-టర్న్’ తీసుకున్నట్లయితే దాన్నయినా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు మద్దతు తెలిపిన సుష్మా స్వరాజ్‌ను బీజేపీ లీడర్లు ఇప్పటికీ ‘తెలంగాణ చిన్నమ్మ’గా పిల్చుకుంటారని గుర్తుచేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలను కూడా ఇప్పుడు తేజస్వి కామెంట్లు తప్పుపడుతున్నట్లుగానే అర్థం చేసుకోవాలా అని ప్రశ్నించారు.

తేజస్వి సూర్య, బీజేపీ క్షమాపణ చెప్పాల్సిందే

తెలంగాణపై నిత్యం విషం చిమ్ముతున్న బీజేపీని తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో పుట్టగతులు లేకుండా చేస్తారని విప్ వేముల వీరేశం న్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలం అంటూనే ఇప్పుడు తెలంగాణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. తేజస్వి సూర్యతో తెలంగాణ బీజేపీ ఎంపీలు క్షమాపణ చెప్పించాలని, పార్టీ తరఫున కూడా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ విధానమేంటో ఇప్పటికైనా బీజేపీ స్పష్టం చేయాలన్నారు. క్షమాపణలు చెప్పకపోతే తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో జరిగే జీహెచ్ఎంసీ, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని శంకరగిరి మాన్యాలకు పంపక తప్పదని హెచ్చరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం తెలంగాణ ఏర్పడిందని, ఆ ఆర్టికల్‌ను పొందుపరుస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దూరదృష్టిని కూడా తేజస్వి కామెంట్లు తప్పుపట్టడమేనని అన్నారు.

తెలంగాణ తల్లిగా సోనియా పాత్ర పదిలం

బీజేపీ నేతల మాటల్లో కుట్ర, విద్వేషం, విషం దాగి ఉన్నదన్నారు. తెలంగాణ సమాజానికి బీజేపీ శని, శాపం లాగా మారిందన్నారు. చెప్పులు మోసేవారే తప్ప రాష్ట్రానికి వారితో ఒరిగేదేమీ ఉండదన్నారు. భవిష్యత్తులో తెలంగాణ గడ్డపై బీజేపీకి నూకలు చెల్లినట్లేనని అన్నారు. రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియాగాంధీ అనేది ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే అంశమన్నారు. ఒక రాష్ట్రానికి పార్టీపరంగా నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ప్రజల త్యాగాన్ని ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని ఆమె సాహసంతో కూడిన నిర్ణయాన్ని తీసుకున్నారని వేముల వీరేశం గుర్తుచేశారు. అమరుల త్యాగాలను చూసిన ఒక తల్లిగా గర్భశోకం ఎలాంటిదో తెలిసి తెలంగాణను ఇచ్చారన్నారు. ఆమె చొరవతో తెలంగాణ ఏర్పడిందనే క్రెడిట్‌ను జీర్ణించుకోలేకనే బీజేపీ పదేపదే తెలంగాణపై విషం చిమ్ముతూ కుట్రపూరితంగా మాట్లాడుతున్నదని అన్నారు. పార్లమెంటులో తేజస్వి కామెంట్లు చేసిన వెంటనే అక్కడున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఖండించారని, కానీ బీజేపీ తెలంగాణ ఎంపీలు మాత్రం సైలెంట్‌గా ఉన్నారని గుర్తుచేశారు.

Read Also: మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఫలించిన బీజేపీ వ్యూహం?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>