కలం, హైదరాబాద్ బ్యూరో: హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తూ విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా మరో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అందుబాటులోకి తెచ్చింది. సికింద్రాబాద్ – ఫలక్‌నుమా – శివరాంపల్లి రైల్వే లైన్‌లోని లెవల్ క్రాసింగ్ నంబర్ 7 వద్ద నిర్మించిన శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (Shastripuram Railway Overbridge)ను శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) ప్రారంభించారు. దీంతో ప్రస్తుతం ఈ రూట్‌లో ఉన్న ట్రాఫిక్ సమస్య తొలగడమే కాకుండా, ప్రయాణికులకు 30 నిమిషాల సమయం ఆదా అవుతుంది. సుమారు రూ. 71 కోట్ల వ్యయంతో 490 మీటర్ల పొడవు,16.60 మీటర్ల వెడల్పుతో రెండు వైపులా రెండేసి లేన్లతో ఈ ప్లైవోర్‌ను నిర్మించారు. శాస్త్రిపురం రోడ్డులో ఉన్న ఈ ఫ్లైఓవర్ మైలార్‌దేవ్‌పల్లిని ఫలక్‌నుమా ఆర్టీసీ బస్ డిపోతో కలుపుతుంది.
ఈ ఫ్లైఓవర్ (Shastripuram Railway Overbridge) అందుబాటులోకి రావడం వల్ల పాతబస్తీ, పరిసర ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. అంతేకాదు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ప్రయాణం సాఫీగా సాగడంతో పెట్రోల్ వినియోగం తగ్గడమే కాకుండా, వాయు, శబ్ధ కాలుష్యం కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ ప్లైఓవర్ ఓల్డ్ సిటీ వాసులకు ఎంతో ఉపశమనాన్ని కలింగించనుంది. ప్రాజెక్ట్ ద్వారా ప్రయాణ సమయం సుమారు 30 నిమిషాలు తగ్గడంతో పాటు, ఈ ప్రాంతంలో కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడి, ఇంధన వినియోగం, వాహన ఉద్గారాలు కూడా తగ్గుతాయి. తద్వారా పర్యావరణ సుస్థిరతకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవనీయ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్‌తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Read Also: చిరాగ్ పాశ్వాన్‌తో కంగనా రనౌత్ డేటింగ్.. అసలు మ్యాటర్ ఇదే
Follow Us On: X(Twitter)

