కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో అకాల వర్షాలు రైతన్నలను నిండా ముంచాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి చేతికొచ్చిన పంట వర్షానికి తడిసిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల (Paddy Procurement)ను వేగవంతం చేయాలని.. ధాన్యం రాసులు తడవకుండా గన్నీ బ్యాగులు అందజేయాలని కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రంలో ధాన్యం త్వరగా కొనుగోలు చేయాలని రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకముందే కొనుగోళ్లు చేపట్టాలన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో గన్ని బ్యాగుల కోసం రైతులు ఎగబడ్డారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తల నెలకొంది. గత వారం రోజులుగా గన్ని బ్యాగుల కొరతతో అధికారులు జొన్న పంటను కొనుగోలు చేయలేదు. దీంతో గన్ని బ్యాగుల లోడ్ తో వచ్చిన లారీలో నుంచి గన్ని బ్యాగులను తీసుకునేందుకు రైతులు ఎగబడ్డారు. గత రాత్రి వర్షం పడడంతో జొన్న పంటను అమ్ముకునేందుకు రైతుల తిప్పలు పడుతున్నారు.
రోడ్డుపై మొక్కజొన్న రైతుల ధర్నా..
అటు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండ గ్రామంలో మొక్కజొన్న రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రభుత్వం మక్కలు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు జరగక రోజుల తరబడి ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్, సిద్దిపేట జిల్లాలో గత రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. మెదక్ జిల్లా అల్లాదుర్గం (మం) బహిరన్ దిబ్బ గ్రామంలో ఈదురుగాలుల ధాటికి ఇంటి పైకప్పులు ఎగిరిపోయి, ఇంటిలోని వస్తువులు ఎగిరిపోయి చెల్లా చెదురుగా పడ్డాయి. చాల ప్రాంతాల్లో కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వరి ధాన్యం వర్షానికి తడిచిపోయింది. గోడౌన్ కప్పు ఎగిరిపోవడంతో ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. అల్లాదుర్గంలో రోడ్డుకి అడ్డంగా భారీ వృక్షం నెలకొరిగింది. దీంతో అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
కిలో మీటర్ మేర ట్రాక్టర్లతో బారులు..
మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట మండలం వస్రం తండా పీఏసీఎస్ కేంద్రం వద్ద మంగళవారం రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి 40 రోజులు అయినా కాంటాలు కాకపోవడంతో ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. ప్రభుత్వం పంట కొనకపోవడంతో ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టారు. మహాబూబాబాద్ జిల్లా తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార గోదాం వద్ద గత నాలుగు రోజులపై నుండి రైతులు రోడ్ల పైనే నిరీక్షిస్తున్నారు. మక్కజొన్న బస్తాలు దిగుమతి కోసం కిలో మీటర్ మేర ట్రాక్టర్లతో బారులు తీరారు. పండించిన పంట అమ్మకానికి రైతుల అరిగోస పడుతున్నారు. హమాలీలు లేక రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అవస్థలు పడుతున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

