కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి (Excise Officer Somireddy), తన ఆత్మగౌరవానికి భంగం వాటిల్లిందన్న ఆవేదనతో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. శాఖలో జరుగుతున్న అవమానాలను భరించలేక, తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను పెరిగిన వాతావరణం తనకు ఆత్మాభిమానంతో బ్రతకడం నేర్పిందని, కానీ ఈ శాఖలో ఉన్నతాధికారుల నుండి ఎదురవుతున్న బూతులు, దూషణలు తన మనస్తత్వాన్ని తీవ్రంగా గాయపరిచాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన ఒక సంఘటన గురించి ప్రస్తావిస్తూ, తాను చేయని తప్పుకు కమిషనర్ అందరి ముందూ తనను నీచంగా దూషించారని సోమిరెడ్డి పేర్కొన్నారు. ‘వెధవ, ఇడియట్’ వంటి మాటలు అన్నప్పుడు, కనీసం అలా అనొద్దని చెప్పినా ఫలితం లేకపోగా, అది సదరు అధికారి అహంకారాన్ని దెబ్బతీసిందని ఆయన వివరించారు. సుమారు పది నిమిషాల పాటు తనతో సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తూ, నలుగురు సహోద్యోగుల ముందు తనను అవమానించారని, ఆ మానసిక వ్యథ భరించలేక తాను స్పృహ కోల్పోయి ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.
అయితే, తనను అవమానించిన అధికారి తీరు కన్నా, అన్యాయాన్ని ప్రశ్నిద్దామని తోటి మిత్రులను కోరినప్పుడు వారిలో కనిపించిన భయం, మౌనం తనను మరింత కుంగదీశాయని ఆయన (Excise Officer Somireddy) వాపోయారు. ‘ఆకలితోనైనా చస్తాం కానీ ఆత్మాభిమానం వదులుకోలేం’ అన్న కాళోజీ మాటలను స్ఫూర్తిగా తీసుకున్న సోమిరెడ్డి, చైతన్యం చచ్చిపోయిన ఈ శాఖలో 30 ఏళ్లు పనిచేసినందుకు సిగ్గుపడుతున్నానని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత, ఆత్మాభిమానం కన్నా ఉద్యోగం ముఖ్యం కాదని భావించి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
Read Also: కాళేశ్వరంపై CBIలో కదలిక.. విచారణకు కేసీఆర్, హరీశ్‌రావు?
Follow Us On : WhatsApp

