గ్లోబల్ టెక్ హబ్‌గా తెలంగాణ: కేటాయింపులు ఇలా!

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో సాధిస్తున్న వృద్ధి దేశానికే గర్వకారణంగా నిలుస్తోందని, ఈ ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2026-27 వార్షిక బడ్జెట్ (Telangana Budget) ప్రసంగంలో ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1500కు పైగా ఐటీ కంపెనీలు కొలువై ఉండగా, వీటి ద్వారా 9.39 లక్షల మందికి పైగా యువతకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తోంది. రాష్ట్ర ఐటీ ఎగుమతులు రికార్డు స్థాయిలో 3.13 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవడం తెలంగాణ టెక్ సామర్థ్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే 1వ, 2వ ఐసీటీ విధానాలతో పాటు ఎలక్ట్రానిక్స్, ఇమేజ్ వంటి వినూత్న పాలసీలను అమలు చేస్తోంది.

హైదరాబాద్ నగరం అంతర్జాతీయ టెక్ దిగ్గజాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. భారతదేశంలోని మొత్తం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లలో (GCCs) సుమారు 20 శాతం వాటా ఒక్క హైదరాబాద్‌లోనే ఉండటం విశేషం. కేవలం గత ఏడాదిలోనే 70కి పైగా కొత్త జీసీసీలు ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ముఖ్యంగా ప్రపంచ స్థాయి సంస్థ గూగుల్ తన ‘సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్’ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం నగర ప్రతిష్టను మరింత పెంచింది. ఐటీ అభివృద్ధి కేవలం పశ్చిమ హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, నగరం చుట్టూ విస్తరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రిడ్ (GRID) విధానాన్ని అత్యంత ప్రాధాన్యతతో ప్రోత్సహిస్తోంది.

డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘టి-ఫైబర్’ ద్వారా విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలపై ఖర్చు తగ్గించి, ప్రభుత్వ కార్యాలయాలకు సురక్షితమైన హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా 424 మండలాల్లోని దాదాపు 8,888 గ్రామ పంచాయతీలకు, 4,800 ప్రభుత్వ సంస్థలకు ఇప్పటికే ఫైబర్ అనుసంధానత కల్పించారు. ఈ ఏడాది చివరి నాటికి 50 వేల ప్రభుత్వ సంస్థలకు ఈ సౌకర్యాన్ని విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ లక్ష్యాలను సాధించడానికి, ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రస్తుత బడ్జెట్‌లో ఐటీ శాఖకు 875 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>