కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఎన్నికల హీట్ (Telangana Elections) ఒక్కసారిగా పెరుగుతున్నది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఖైరతాబాద్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు తమ కార్యాచరణకు పదును పెడుతున్నాయి. షెడ్యూల్ రాకముందే ప్రిపరేషన్స్ మొదలుపెట్టాయి. నిరసనలు, భారీ కార్యక్రమాలతో కేడర్‌ను కాంగ్రెస్ యాక్టివ్ చేస్తుండగా.. బీఆర్‌ఎస్ వరుస భేటీలతో ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నది. బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని రంగంలోకి దింపుతూ పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నది.
కాంగ్రెస్ భారీ కార్యక్రమాలు
కాంగ్రెస్ పార్టీ నేడు ‘సర్’పై ఎన్నికల కమిషన్ తీరును ఎండగడుతూ నిరసన చేపట్టనుంది. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో టీపీసీసీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో 1,157 చరకాల ప్రదర్శనతో పాటు అదే సంఖ్యలో బాలగాంధీల నడక, విగ్రహాల ప్రదర్శన, స్వదేశీ మేళాలు చేపట్టనున్నారు. గాంధీ సిద్ధాంతాలను ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. తద్వారా కాంగ్రెస్ శ్రేణులను సమీకరించడంతో పాటు.. ప్రజల్లో గాంధీ సిద్ధాంతాలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాన్ని రెడీ చేస్తున్నట్లు గాంధీభవన్ వర్గాల సమాచారం. మరోవైపు అక్టోబర్ 10న సీఎం రేవంత్రెడ్డి సిరిసిల్ల పర్యటనకు వెళ్లనున్నారు.
సిట్టింగ్ సీటుపై బీఆర్‌ఎస్ గురి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్‌లో రాజేంద్రనగర్ నియోజకవర్గం, శంషాబాద్ మండలం బహదూర్గూడలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులతో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం సాయంత్రం ఉమ్మడి మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బీఆర్‌ఎస్ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ఓటర్ల నమోదు, నేతల సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి బీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో దాన్ని నిలబెట్టుకోవడంతో పాటు మరో స్థానాన్ని దక్కించుకునే దిశగా పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తున్నది.
పదాధికారులతో ప్రత్యేక భేటీ?
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 4న తెలంగాణలో పర్యటించనున్నారు. ఆదివారం మీడియా చిట్ చాట్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమిత్ షా పర్యటనను ధ్రువీకరించారు. కరీంనగర్‌లోని ఓ మెడికల్ కాలేజీ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు.. పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నట్లు సమాచారం. గతంలో ఓసారి పర్యటన ఖరారైనా చివరి నిమిషంలో అనివార్య కారణాలతో వాయిదా పడింది. అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తే హైదరాబాద్‌లో రాష్ట్ర బీజేపీ పదాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. రాబోయే రెండున్నర నుంచి మూడేళ్లలో పార్టీ చేపట్టాల్సిన సంస్థాగత, రాజకీయ కార్యాచరణపై ఆయన నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

