కలం, వరంగల్ బ్యూరో: మామునూరు ఎయిర్పోర్ట్ (Mamnoor Airport) పునరుద్ధరణ పనులు ముందుకు సాగుతున్న వేళ.. విమానాశ్రయానికి ఏ పేరు పెట్టాలనే అంశం ఆసక్తికరంగా మారింది. ఎయిర్‌పోర్ట్‌కు పేరు సూచించాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునివ్వడంతో పలువురు తమ ప్రతిపాదనలను వెల్లడిస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది రాణి రుద్రమదేవి (Rani Rudrama Devi) పేరే పెట్టాలని కోరుతున్నారు. వరంగల్ కాకతీయుల రాజధానిగా ఉన్న చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పేరు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
నిజాం కాలంలోనే పునాది
మామునూరు ఎయిర్పోర్ట్ 1930లో నిజాం పాలనలో ఏర్పాటైంది. సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని పేపర్ పరిశ్రమకు, వరంగల్‌లోని అజం జాహీ మిల్లుకు అనుకూలంగా ఉండేలా ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసినట్లు పాత రికార్డుల ఆధారంగా తెలుస్తోంది. అప్పట్లో సుమారు 1,875 ఎకరాల విస్తీర్ణం, 6.6 కిలోమీటర్ల రన్‌వే, పైలట్, సిబ్బంది నివాసాలు, పైలట్ శిక్షణ కేంద్రం, టెర్మినల్ సదుపాయాలు ఉన్నట్లు నమోదైంది.
యుద్ధ సమయంలో వినియోగం
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మామునూరు ఎయిర్‌స్ట్రిప్‌ను బ్రిటిష్ వాయుసేన ఉపయోగించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 1962 ఇండో–చైనా యుద్ధ సమయంలో ఢిల్లీ విమానాశ్రయంపై భద్రతా ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వ విమానాలను మామునూరులో ఉంచారు. అప్పట్లో పలువురు ప్రధానులు, రాష్ట్రపతులు మామునూరులో దిగినట్లు కూడా రికార్డులు చెబుతున్నాయి. మామునూరు విమానాశ్రయం 1981 వరకు సేవల్లో ఉన్నట్లు పాత నివేదికలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత సాధారణ విమాన రాకపోకలకు దూరమైంది. హైదరాబాద్‌లో విమానయాన మౌలిక వసతుల విస్తరణతో పాటు మామునూరు నిర్వహణ, వినియోగం తగ్గిపోవడం వంటి కారణాలతో అది క్రమంగా క్రియాశీలత కోల్పోయింది. 2007లో మామునూరు, కడప విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ఏఏఐ ఒప్పందం చేసుకున్నప్పటికీ.. మామునూరు ప్రాజెక్టు ముందుకు సాగలేదు.
భూసేకరణతో పునరుద్ధరణకు అడుగు
నాలుగు దశాబ్దాల తర్వాత మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను పునరుద్ధరించేందుకు అవసరమైన భూమిని సమకూర్చాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో భూసేకరణ చేపట్టారు. మామునూరు పరిసర ప్రాంతాల్లో సుమారు 500 ఎకరాల భూమిని సేకరించినట్లు సమాచారం. రైతులకు పరిహారం చెల్లింపు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో నిర్మాణ పనులు ముందుకు సాగుతున్నాయి.
వరంగల్ అభివృద్ధికి కనెక్టివిటీ
ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే వరంగల్‌కు రైలు, రోడ్డు రవాణాతోపాటు విమాన కనెక్టివిటీ కూడా ఏర్పడుతుంది. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంటుంది. వైద్య సేవలు, ఉన్నత విద్య, వ్యాపారం, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు మెరుగైన రవాణా సదుపాయం అందే అవకాశం ఉంది. వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం, రామప్ప వంటి చారిత్రక, పర్యాటక ప్రాంతాలకు వచ్చే సందర్శకులకు కూడా విమాన సదుపాయం ఉపయోగపడే అవకాశం ఉంది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సూచన
ఎయిర్‌పోర్ట్‌కు పేరు పెట్టేందుకు సూచనలు చేయాలని సీఎం కోరిన నేపథ్యంలో రాణి రుద్రమదేవి, కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేర్లు ప్రతిపాదనల్లో ఉన్నాయి. జిల్లాకు చెందిన ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ పేర్లను సూచించారు. మరికొందరు సమ్మక్క–సారక్క, కాకతీయ ప్రతాపరుద్ర పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. రాణి రుద్రమదేవి పేరు ఎక్కువగా వినిపిస్తుండగా.. తుది పేరును ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంది.
పూర్వ వైభవానికి ఎదురుచూపులు
దశాబ్దాలుగా విమాన రాకపోకలకు దూరంగా ఉన్న మామునూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణతో వరంగల్‌కు కొత్త రవాణా మార్గం అందుబాటులోకి రానుంది. నిర్మాణ పనులు పూర్తయి విమాన సర్వీసులు ప్రారంభమైతే ఉమ్మడి వరంగల్ ప్రాంతానికి రవాణా, పర్యాటకం, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలకు మార్గం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు ఏ పేరు పెడతారనే అంశంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

