కరీంనగర్‌లో మండి, షావర్మా హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

కలం, ​కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని మండి(Mandi), షావర్మా రెస్టారెంట్లలో (Shawarma Restaurants ) పచ్చి కోడిగుడ్లతో తయారుచేసే ‘రా ఎగ్ మయోనైజ్’ వినియోగంపై ఆహార భద్రత విభాగం అధికారులు (Food Safety Officials) గురువారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పి. రోహిత్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వి. అంకిత్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని షావర్మా కార్నర్ (ఐబీ చౌరస్తా), క్వాలిటీ మండి (గీతా భవన్ చౌరస్తా), అరేబియన్ కిచెన్ (ముకరంపుర), కోయి మండి (బ్యాంక్ కాలనీ) రెస్టారెంట్లలో అధికారులు విస్తృతంగా సోదాలు (Raids) చేపట్టారు.

తనిఖీ చేసిన ఈ నాలుగు హోటళ్లలోనూ పచ్చి గుడ్ల మయోనైజ్ వాడటం లేదని, కేవలం వెజ్ మయోనైజ్ మాత్రమే వినియోగిస్తున్నారని అధికారులు నిర్ధారించారు. అయితే, రా ఎగ్ మయోనైజ్ తయారీ, వినియోగంపై ఉన్న నిబంధనల గురించి నిర్వాహకులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం వంటగదులను పరిశీలించగా ముకరంపురలోని ‘అరేబియన్ కిచెన్’, గీతా భవన్ చౌరస్తాలోని ‘క్వాలిటీ మండి’ రెస్టారెంట్లలో తీవ్రమైన పరిశుభ్రతా లోపాలు బయటపడ్డాయి. ఈ రెండు హోటళ్లలో వెజ్, నాన్-వెజ్ పదార్థాలను ఒకే ఫ్రీజర్‌లో కలిపి నిల్వ చేయడం, వెన్నకు బదులుగా డెలీషియస్ ఫ్యాట్ స్ప్రెడ్ వాడటం, జిడ్డు పేరుకుపోయి పూర్తిగా మురికిగా మారిన ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, కూరగాయలు కోయడానికి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ముఖ్యంగా క్వాలిటీ మండిలో చికెన్ వంటకాలకు హానికరమైన సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు తేలడంతో, సుమారు 10 కిలోల చికెన్‌ను అక్కడికక్కడే పారవేయించారు. ​ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన అరేబియన్ కిచెన్, క్వాలిటీ మండి నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు FSSAI చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. హోటల్ నిర్వాహకులు వంటగదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వెజ్, నాన్-వెజ్ పదార్థాలను వేర్వేరుగా నిల్వ చేయాలని, అనుమతించిన ఆహార రంగులను మాత్రమే వాడాలని అధికారులు స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి ఆకస్మిక తనిఖీలు, కఠిన చర్యలు నిరంతరం కొనసాగుతాయని హెచ్చరించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>