సర్రే గూటికి చేరిన ఇంగ్లాండ్ దిగ్గజ పేసర్ ఆండర్సన్!

కలం, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ (James Anderson) 2027 కంట్రీ ఛాంపియన్‌షిప్ సీజన్‌లో సర్రే (Surrey) జట్టు తరఫున ఆడనున్నారు. ఈ విషయాన్ని సర్రే క్లబ్ గురువారం ప్రకటించింది. 2001లో లంకాషైర్ తరఫున దేశవాళీ క్రికెట్ ప్రారంభించిన ఆండర్సన్, 2003లో ప్రస్తుత సర్రే డైరెక్టర్ అలెక్ స్టీవర్ట్‌తో కలిసి టెస్టుల్లో అరంగేట్రం చేశారు. 21 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 704 టెస్ట్ వికెట్లతో సహా మొత్తం 911 వికెట్లు పడగొట్టారు. 2018లో ఇదే కియా ఓవల్ మైదానంలో మహ్మద్ షమీని అవుట్ చేసి, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా గ్లెన్ మెక్‌గ్రాత్ రికార్డును అధిగమించారు.

2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆండర్సన్.. 2025లో ‘నైట్‌హుడ్’ గౌరవం అందుకున్నారు. 2026 సీజన్‌లో లంకాషైర్ కెప్టెన్‌గా 50 వికెట్లు తీసి సత్తా చాటారు. లంకాషైర్ తరఫున మొత్తంగా 112 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 443 వికెట్లు, 61 లిస్ట్-ఏ మ్యాచ్‌లలో 83 వికెట్లు, 40 టీ20ల్లో 50 వికెట్లు తీశారు. అయితే, 2026 సీజన్ తర్వాత కొత్త ఒప్పందం ఇవ్వలేమని లంకాషైర్ స్పష్టం చేయడంతో ఆండర్సన్ సర్రే జట్టులో చేరారు. టైటిల్ పోరులో నిలిచే బలమైన జట్టులో చేరడం గౌరవంగా భావిస్తున్నానని ఆండర్సన్ తెలిపారు. ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్న కియా ఓవల్‌లో మళ్లీ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. మైదానంలో వికెట్లు తీయడంతో పాటు యువ ఆటగాళ్ల నైపుణ్యాలను మెరుగుపరచడానికి తన అనుభవం ఉపయోగపడుతుందని వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>