తెలంగాణలో జల సంక్షోభం ముప్పు..ఇక కష్టాలేనా?

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో (Telangana) తాగునీటి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. లోటు వర్షపాతం, పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో భూగర్భ జలమట్టాలు క్రమంగా పడిపోతున్నాయి. ఈ వానాకాలంలో పలు చెరువులు, కుంటలు ఆశించిన స్థాయిలో నిండకపోవడంతో రానున్న వేసవిలో నీటి ఇబ్బందులు మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు మొదలయ్యాయి.

గ్రామాలు, నగర శివార్లలో నీటి ఎద్దడి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారు 50 శాతం గ్రామాలకు తాగునీరు (Drinking Water) సక్రమంగా అందడం లేదని సమాచారం. నగర శివారు ప్రాంతాల్లోనూ పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో 1,000 నుంచి 1,500 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా నీరు లభించని పరిస్థితి నెలకొంది. సదాశివపేటకు రోజుకు సుమారు 80 లక్షల లీటర్ల నీరు అవసరం కాగా, ప్రస్తుతం 50 లక్షల లీటర్లు మాత్రమే సరఫరా అవుతున్నాయి. అదీ రెండు రోజులకోసారి అందుతోంది.

రిజర్వాయర్లలో తగ్గుతున్న నీటి నిల్వలు

గోదావరి, కృష్ణా బేసిన్లలోని పలు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. నిజాంసాగర్‌లో 17.80 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి ప్రస్తుతం సుమారు 12 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. యాసంగి పంటకు నీటిని విడుదల చేస్తే నిల్వలు మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో వచ్చే జనవరి, ఫిబ్రవరి నుంచే తాగునీటి సమస్యలు మొదలయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

సింగూరు నీటిపై వేలాది ఆవాసాల ఆధారం

సింగూరు రిజర్వాయర్‌లోనూ నీటి నిల్వలు భారీగా తగ్గాయి. 30 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం కేవలం 4 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రిజర్వాయర్ నీటిపై 2,395 గ్రామీణ ఆవాసాలు, 19 పట్టణాలు ఆధారపడుతున్నాయి. అందుబాటులో ఉన్న నీటిలో 3 టీఎంసీలు వినియోగిస్తే సుమారు 80 రోజుల తాగునీటి అవసరాలను తీర్చే అవకాశం ఉందని అంచనా.

ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి?

అక్టోబర్‌, నవంబర్‌ నాటికి కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రెండో పంటకు సాగునీటిని విడుదల చేస్తే తాగునీటి నిల్వలపై ప్రభావం పడుతుందన్న ఆందోళన ఉంది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు మల్లన్నసాగర్‌, శ్రీశైలం నుంచి ప్రత్యామ్నాయంగా నీటిని తరలించే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే మరో ఏడు ఉమ్మడి జిల్లాల్లో ప్రస్తుతం తాగునీటి సమస్య లేదని అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>