కలం, స్పోర్ట్స్ : ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్‌కు మరో గోల్డ్ మెడల్ వచ్చింది. మహిళల ట్రాప్ షూటింగ్‌లో నీరు ధండా (Neeru Dhanda) అదరగొట్టారు. ఫైనల్లో 30కి 28 గురులు సాధించి స్వర్ణం గెలిచారు. దీంతో 2026 ఆసియా క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో గోల్డ్ సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారు. చైనాకు చెందిన సన్ యునాంగ్ 26 గురులతో రజతం సాధించారు. కువైట్‌కు చెందిన హజర్ అబ్దుల్మాలిక్ 21 గురులతో కాంస్యం గెలిచారు. నీరు ధండా ప్రదర్శనతో భారత్ ఖాతాలో మొత్తం ఐదు స్వర్ణాలు, 47 పతకాలు చేరాయి.
ఫైనల్‌కు ముందే నీరు తన సత్తా చాటారు. క్వాలిఫికేషన్‌లో 125కి 118 గురులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించారు. 28 గురులతో నీరు ఆసియా రికార్డును కూడా బద్దలు కొట్టారు. గత రికార్డు 24 గురులుగా ఉంది. అంతకుముందు మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్‌లోనూ నీరు (Neeru Dhanda) కీలక పాత్ర పోషించారు. ఆశిమా అహ్లావత్, మానిషా కీర్‌లతో కలిసి భారత్‌కు రజతం అందించారు. నీరు ధండాకు ఈ విజయం వరుసగా వస్తున్న పెద్ద విజయాల్లో మరో మైలురాయి.
జూలైలో లొనాటోలో జరిగిన ISSF వరల్డ్‌కప్‌లో మహిళల ట్రాప్‌లో వ్యక్తిగత గోల్డ్ గెలిచిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు అదే జోరును ఆసియా క్రీడల్లోనూ కొనసాగించారు. వ్యక్తిగత ట్రాప్‌లో భారత్‌కు తొలి ఆసియా క్రీడల స్వర్ణాన్ని అందించారు. నీరు ధండా ప్రయాణంలో ఆమె మేనమామ కుమారుడు లక్ష్య్ షెరోన్‌ది కూడా కీలక పాత్ర. 2018 ఆసియా క్రీడల్లో లక్ష్య్ ట్రాప్‌లో రజతం గెలిచారు.
షూటింగ్‌పై ఆసక్తి పెంచుకున్న సమయంలో నీరుకు ఆయన ప్రేరణగా నిలిచారు. ప్రారంభ దశలో తన గన్‌ను కూడా నీరుకు ఇచ్చారు. ఆ ప్రేరణతో మొదలైన ప్రయాణం ఇప్పుడు ఆసియా క్రీడల గోల్డ్ వరకు చేరింది. భారత షూటింగ్‌కు ఈ విజయం మరో చారిత్రక ఘట్టంగా నిలిచింది.
Also Read : ములుగు గట్టమ్మ ఆలయంలో “ది ప్యారడైజ్” చిత్ర బృందం ప్రత్యేక పూజలు
Follow Us On : WhatsApp

