వచ్చే నెలలో నామినేటెడ్ పోస్టులు..

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టుల్ని (Nominated Posts) వచ్చే నెలలో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. కొన్ని కుల సంఘాల ఫెడరేషన్ల పోస్టులపై ఇప్పటికే అర్హులైనవారి జాబితా సిద్ధమైంది. పార్టీపరంగా తగిన పదవులు, అవకాశాలు రానివారికి ఈసారి నామినేటెడ్ పోస్టులతో సంతృప్తి పర్చాలని పార్టీ గతంలోనే నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం గతంలో పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయిస్తూ తగిన అవకాశాలు కల్పించనున్నట్లు హామీ ఇచ్చారు. రాజకీయంగా తగిన అవకాశాలు రానివారికి ప్రభుత్వపరంగా నామినేటెడ్ పోస్టుల్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశానికి హాజరైన పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ నామినేటెడ్ పోస్టుల్ని వచ్చే నెలలో భర్తీ చేయాలన్న ఆలోచనను వివరించారు. సంస్థాగతంగా కూడా కొన్ని పదవుల్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. పీసీసీ కార్యవర్గంలో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయడంతో పాటు ఆశావహులకు అవకాశాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ ఓబీసీ సెల్ నెక్స్ట్ మీటింగ్ తెలంగాణలో :

కాంగ్రెస్ ఓబీసీ సెల్ సమావేశానికి హాజరైన సందర్భంగా రాహుల్‌గాంధీతో విడిగా సమావేశమైన సందర్భంగా రాష్ట్రంలోని పార్టీ పరిస్థితి, ప్రభుత్వ నిర్వహణ, ఆశావహుల కోరికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గంలో స్థానం కోసం ఎదురుచూస్తున్నవారికి సంబంధించిన అంశాలను వివరించినట్లు తెలిసింది. ఓబీసీ సెల్ తదుపరి సమావేశాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరారు. దానికి తగిన ఏర్పాట్లు చేస్తామని రాహుల్‌కు పీసీసీ చీఫ్ హామీ ఇచ్చారు. దాదాపు పావుగంట పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలపై వివరించారు. తాజా రాజకీయ అంశాలపైనా ఇరువురూ చర్చించుకున్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకాలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు, బిఎల్ఏ నియామకాలు, అనుబంధ సంఘాల నియామకాలు తదితర అంశాలపైనా రాహుల్ గాంధీకి వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>