కలం, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) కార్యక్రమాల్లో ఆహార వృథాను అరికట్టేందుకు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నేతల చిత్రపటాలకు చేసే క్షీరాభిషేకం, జలాభిషేకం వంటి కార్యక్రమాలకు స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షుడు టి.కుమార్ రావు వెల్లడించారు.
ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఏ కార్యక్రమంలోనైనా పాలు, నీళ్లు, భారీ యంత్రాలతో పెద్ద పూలదండలు వేయడం నిషేధం. ఇలా ఆహారాన్ని వృథా చేసే బదులు, యంత్రాలతో ప్రమాదకరంగా వ్యవహరించే బదులు అవసరమైన వారికి ఆహార పంపిణీ చేయాలని ఆయన సూచించారు. పార్టీ కార్యక్రమాల్లో దండలు వేసేందుకు బుల్డోజర్లు, జేసీబీలు వాడకూడదని చెప్పారు. పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

