కలం, వెబ్ డెస్క్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కార్యకర్తలకు పార్టీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) గుడ్ న్యూస్ చెప్పారు. కార్యకర్తలకు మరింత చేరువయ్యేందుకు సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. జగన్ 2.0 సూపర్ యాప్ (YSRCP 2.0 Super App) పేరుతో రూపొందించిన దీనిని నేడు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ ప్రారంభించారు. ఈ రోజు ఉదయం తాడేపల్లిలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. జూలై 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
ఇక యాప్ విషయానికొస్తే జగన్ 2.0 సూపర్ యాప్ వైసీపీలో డిజిటల్ విప్లవమని జగన్ పేర్కొన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలపై వేధింపులు పెరిగిపోయాయన్నారు. ఈ నేపథ్యంలో సూపర్ యాప్‌లో ఉండే డిజిటల్ డైరీలో వేధింపులకు గురైన వారు ఫిర్యాదులు నమోదు చేయవచ్చని చెప్పారు. ప్రతీ కార్యకర్త నిత్యం పార్టీతో అనుసంధానమై ఉండేలా యాప్‌ను రూపొందించినట్లు జగన్ తెలిపారు. పార్టీలోని ముఖ్య నేతలు సైతం నేరుగా కార్యకర్తలతో టచ్‌లో ఉండవచ్చన్నారు.
ఈ యాప్‌తో వైసీపీ సోషల్ మీడియా మరింత పుంజుకుంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. ఇచ్చిన టాస్క్‌లను విజయవంతంగా పూర్తి చేసిన వారికి రివార్డులు ఉంటాయన్నారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచే వారితో జగన్ నేరుగా వీడియో కాల్స్, ఆడియో కాల్స్ కూడా మాట్లాడతారని తెలిపారు. ఆపదలో ఉన్న కార్యకర్తలకు తక్షణ సాయం అందించేందుకు కూడా యాప్ పని చేస్తుందన్నారు. ఇలా అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉండేందుకు ఏఐ టెక్నాలజీతో యాప్ రూపొందించినట్లు తెలిపారు.

