సీతారామను గాలికొదిలేశారు.. బీఆర్ఎస్‌పై పొంగులేటి ఫైర్

కలం, ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లా ప్రజలు తమకు ఓట్లు వేయలేదనే రాజకీయ కక్షతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత కీలకమైన సీతారామ ప్రాజెక్టును (Sita Rama Project) నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) ఆరోపించారు. గురువారం డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీతారామ ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గిరిజనులు అధికంగా నివసించే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతాంగానికి గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేసిందని, ప్రస్తుతం ప్రాజెక్టు పరిస్థితిని చూస్తే తీవ్ర ఆవేదన కలుగుతోందని పేర్కొన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యం లభించినట్లే, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వాటి అభివృద్ధికి దశలవారీగా చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను పక్కనపెట్టి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సీతారామతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టును కూడా సరిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. గత పాలకుల వల్ల ఏర్పడిన ఆర్థిక భారాన్ని అధిగమిస్తూ నీటిపారుదల రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు.

సీతారామ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం కేవలం రూ.115 కోట్లు మాత్రమే ఖర్చు చేసి పనులను అసంపూర్తిగా వదిలేసిందని, ప్రస్తుతం తమ ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించి 1,480 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తోందని మంత్రి వెల్లడించారు. దీని ద్వారా ఖమ్మం, వైరా, సత్తుపల్లి ప్రాంతాలకు తాగునీటితో పాటు ప్రస్తుతం 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ రైతులను కరువు నుంచి రక్షిస్తున్నామని చెప్పారు. అవసరమైతే అదనపు నీటి సరఫరా కూడా చేపడతామని హామీ ఇచ్చారు. పదేళ్ల పాలనలో ప్రజల సమస్యలను పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు అసత్య ప్రచారాలకు పాల్పడడం మానుకుని, ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసైనా వాస్తవాలను గుర్తించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>