Mobile Popup Ad
Mobile Popup Ad

కేబినెట్ భేటీకి డేట్‌ ఫిక్స్‌ : అధికారులకు సీఎస్ కీలక ఆదేశాలు!

కలం, వెబ్‌ డెస్క్‌ : తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి (Telangana Cabinet) సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని ఆరో అంతస్తులో ఉన్న కేబినెట్ మీటింగ్ హాల్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇది 33వ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం కానుంది.

ఈరోజే డెడ్‌లైన్.. అజెండా లేకుంటే నిల్ రిపోర్ట్ :

కేబినెట్ భేటీ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. వివిధ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు వీలుగా అజెండా రూపకల్పనను వేగవంతం చేశారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపాల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులు తమ శాఖల పరిధిలోని ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. ఆయా అంశాలకు సంబంధించిన తెలుగు అనువాద ప్రతిని కూడా జతపరిచి ఈరోజు (మే 19) సాయంత్రం 6 గంటల లోపు జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎలాంటి ప్రతిపాదనలు లేనట్లయితే నిల్ నివేదికను పంపాలని స్పష్టం చేశారు.

అధికారులందరూ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలి :

మంత్రిమండలి సమావేశం ముగిసే వరకు ఉన్నతాధికారులందరూ అందుబాటులో ఉండాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఎవరూ సెలవుల్లో వెళ్లకుండా హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని సీఎస్ పేర్కొన్నారు. సమావేశానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రోటోకాల్ విభాగం, హార్టికల్చర్ డైరెక్టర్, సచివాలయ బ్రాంచ్ మేనేజర్‌లకు బాధ్యతలు అప్పగించారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు, తాజా పరిణామాలపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>