కలం, కరీంనగర్: దేశంలో బహుజనుల అభివృద్ధి, సంక్షేమమే కేంద్రంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. బహుజనులకు రాజ్యాధికారం అప్పగించిన ఘనత కూడా బీజేపీదేనన్నారు. మోదీకి ప్రధాని పదవి అప్పగించడమే ఇందుకు నిదర్శనమన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న పోరాట స్పూర్తితో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, బీజేపీ కార్పోరేటర్లు, స్థానిక నేతలతో కలిసి ఆయన కరీంనగర్ రేకుర్తిలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.
వెన్నుచూపని వీరుడు సర్వాయి పాపన్న..
సామాన్య కల్లుగీత కుటుంబంలో పుట్టి నాటి మొగల్ చక్రవర్తుల వెన్నులో వణుకు పుట్టించిన అసామాన్యుడు, వెన్నుచూపని వీరుడు మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. తాటిచెట్టు ఎక్కి కల్లుగీసే వృత్తి నుండి గొల్లకొండ కోటపై జెండా ఎగరేసిన తొలి తెలుగు బహజన చక్రవర్తి, బహజనుల ఆశాదీపం సర్దార్ సర్వాయి పాపన్న అని పేర్కొన్నారు. పాపన్న జయంతి సందర్భంగా మనమంతా ఆయనను స్మరించుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు.
ఒక్కడితో ప్రారంభమై.. వేల సైన్యం..
సర్వాయి పాపన్నకు ఆనాడు సిద్ధాంతాలు తెలియవని.. ప్రపంచ విప్లవాల అధ్యయనం అసలే లేదని అన్నారు. ఉన్నత రాజరిక వంశ పారంపర్యం లేదని.. అతి సామాన్య కల్లుగీత కుటుంబం పాపన్నదని చెప్పుకొచ్చారు. కానీ ఆనాటి మొఘల్ చక్రవర్తుల నిరంకుశ పాలనను, స్థానిక జమిందారులు, జాగీర్దారులు, దేశ్ ముఖ్ లు, భూస్వాముల దోపిడిని, దౌర్జన్యాలకు విసిగిపోయి ఎదిరించడానికి అతను చేసిన సాహసం ఎనలేనిదని కొనియాడారు. ఒక్కడితో ప్రారంభమైన సర్దార్ పాపన్న పోరాటం సబ్బండ కులాల పీడిత ప్రజలను సమీకరించుకొని 12 వేల సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని.. గెరిల్లా పోరాటాలు చేస్తూ తన స్వస్థలం ఖిలాషాపూర్ రాజధానిగా పాలన సాగించాడని గుర్తు చేశారు.
ప్రతి ఒక్కరూ స్మరించుచుకోవాలి..
ఛత్రపతి శివాజీ మహరాజ్, సర్దార్ సర్వాయి పాపన్న దాదాపు సమకాలీనులేనని బండి సంజయ్ అన్నారు. ‘ఇద్దరూ సామాన్య కుటుంబంలో పుట్టినోళ్లే. మొఘల్ చక్రవర్తులను ఎదిరించి రాజ్యాలను స్వాధీనం చేసుకున్న వాళ్లే. కానీ ఛత్రపతి శివాజీకి దేశ చరిత్రలో దక్కిన స్థానం సర్దార్ సర్వాయి పాపన్న (Sardar Sarvai Papanna)కు దక్కకపోవడం బాధాకరం. బాదిత, పీడిత ప్రజల కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి రాజ్యస్థాపన చేసిన సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను ప్రతి ఒక్కరూ స్మరించుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని అన్నారు.
ఆ ఘనత బీజేపీదే..
ఈ దేశంలో బహుజనులకు రాజ్యాధికారం అప్పగించిన ఘనత భారతీయ జనతా పార్టీదేనని బండి సంజయ అన్నారు. “బీసీ బిడ్డ మోదీకి ప్రధాని పదవి అప్పగించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. గత 12 ఏళ్లుగా దేశంలో బహుజనుల అభివృద్ధి, సంక్షేమమే కేంద్రంగా నరేంద్రమోదీ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తోందని చెప్పారు. ఫలితంగా బడుగు, బహుజనుల చేతిలో బ్యాంకు ఖాతా వచ్చిందని అన్నారు. బహుజనుడి ఇంటికి మరుగుదొడ్డి వచ్చింది. బహుజనుడి ఇంటికి గ్యాస్ వచ్చింది. బహుజనుడి కుటుంబానికి ఇల్లు వచ్చింది. బహుజనుడి బిడ్డకు స్కాలర్‌షిప్ వచ్చింది. బహుజనుడి చేతికి రుణం వచ్చింది. బహుజనుడి వృత్తికి ఆధునిక పనిముట్లు వచ్చాయి. ముఖ్యంగా బహుజనుడి జీవితంలో ‘నేను కూడా ఎదగగలను’ అనే ఆత్మవిశ్వాసం వచ్చింది!” అని చెప్పుకొచ్చారు.
బహుజనుల కోసం మోదీ ప్రభుత్వం కృషి..
రాజ్యాంగబద్దంగా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ను ఏర్పాటు చేసి ఓబీసీలకు రాజ్యాంగపరమైన గౌరవం దక్కిందని బండి సంజయ్ అన్నారు. బహుజనుల సమస్యలను వినే కమిషన్ మాత్రమే కాదని… బహుజనుల హక్కులను కాపాడే రాజ్యాంగ సంస్థను మోదీ ప్రభుత్వం బలోపేతం చేసిందని చెప్పారు. ఓబీసీలకు 27% రిజర్వేషన్ కల్పించిందన్నారు. నీట్ సహా వృత్తి విద్యా కోర్సుల్లో 27 శాతం సీట్లు బహజనులకే దక్కేలా చేసిందని కొనియాడారు. తద్వారా ఒక బహుజన కుటుంబంలో డాక్టర్ పుట్టడం అంటే.. అది ఒక్క విద్యార్థి విజయం మాత్రమే కాదని, ఆ కుటుంబం తరతరాల ఆర్థిక స్థితిని మార్చే విప్లవమని పేర్కొన్నారు.
మోదీ హయాంలో అనేక పథకాలు..
ఇవేగాకుండా PM-YASASVI పథకం ద్వారా బహుజన విద్యార్థులకు కేంద్రం వేల కోట్ల రూపాయల స్కాలర్ షిప్స్ అందిస్తూ అండగా నిలిస్తోందని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. PM విశ్వకర్మతో బహుజనుల సంప్రదాయ వృత్తులకు గౌరవం తెచ్చిందన్నారు. వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, స్వర్ణకారుడు, క్షురకుడు, దర్జీ, మేస్త్రీ, చాకలి తదితర 18 సంప్రదాయ వృత్తులను PM Vishwakarma పరిధిలోకి తీసుకు రావడమే కాకుండా 5 వేల కోట్ల రూపాయల రుణాల విలువైన పనిముట్లు అందించి దాదాపు 30 లక్షల మందికి లబ్ది చేకూర్చిందని కొనియాడారు.
PMEGP ద్వారా స్వయం ఉపాధికి బ్యాంకు రుణాలందిస్తూ దాదాపు 33 లక్షల ఉద్యోగాలు సృష్టించిందని చెప్పారు. PM SVANidhi ద్వారా వీధి వ్యాపారికి గౌరవం కల్పించిందని.. రోడ్డుపై చిన్న బండి పెట్టుకుని జీవించే వ్యక్తి కూడా ఆర్థిక వ్యవస్థలో ఒక వ్యాపారవేత్తే అనే భావనను PM SVANidhi బలపరిచిందని అన్నారు. 2026 మే నాటికి 17 వేల 710 కోట్ల రూపాయల రుణాలిచ్చి 75 లక్షల 27 వేల మందికి లబ్ది కల్పించిందని చెప్పారు.
కాంగ్రెస్‌పై ఫైర్..
కాంగ్రెస్ పార్టీ మాత్రం బహుజనుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందని బండి సంజయ్ మండిపడ్డారు. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని 50 ఏళ్లకుపైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్క బహుజన బిడ్డను కూడా ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని చేయలేకపోయిందని దుయ్యబట్టారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ సంక్షేమం కోసం ఏటా 20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ద హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. అత్యంత వెనుకబడిన ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అన్నారు. వాళ్ల సమస్యలకు ప్రత్యేక బడ్జెట్ అన్నారు. ఇందులో ఏ ఒక్క హామీని అమలు చేయకుండా బహుజనులను దారుణంగా మోసం చేశారు’ అని విమర్శించారు.
కాంగ్రెస్ సమాధానం చెప్పాలి..
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారని.. ప్రస్తుత రాష్ట్ర కేబినెట్ లో ఎంత మంది బీసీలున్నారు? అని ప్రశ్నించారు. ఎంత మందికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇచ్చారు? ఎంత మందికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించారు? అని నిలదీశారు. అంతెందుకు సీఎంఓలో ఎంత మంది బీసీ ఉన్నతాధికారులు ఉన్నారో? వివిధ శాఖల అధిపతులుగా ఎంత మంది బహజన బిడ్డలను నియమించారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

