కలం, నిర్మల్: సాంకేతిక విద్యా వ్యవస్థను యథాతథంగా కొనసాగిస్తూ పాలిటెక్నిక్ (Polytechnic) విద్యను మరింత బలోపేతం చేయాలని.. ఏబీవీపీ (ABVP) ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేపట్టి ప్రభుత్వ ప్రతిపాదిత నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. జీఓ నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అమృత్ చారి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మార్పుల వల్ల పాలిటెక్నిక్ కళాశాలల ఉనికికి, విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలిగే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నాయని తెలిపారు.
పాలిటెక్నిక్ విద్యను ఇతర సంస్థలలో విలీనం చేయడం వల్ల ఇంజనీర్ కావాలనే లక్ష్యంతో ఉన్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలోని శక్తి విభాగంలో పాలిటెక్నిక్ విద్యను చేర్చే ప్రతిపాదనను ప్రభుత్వం పునఃపరిశీలించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే జీఓ నంబర్ 97ను రద్దు చేసి పాలిటెక్నిక్ కళాశాలలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సాయి అక్షయ్, పవన్, కార్తీక్, రామ్ చరణ్, అలీషా, వంశీతో పాటు పలువురు పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు.

