కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోతో జరిగిన మ్యాచ్ (RR vs LSG)లో రాజస్థాన్ ఎట్టకేలకు విజయం సాధించింది. ఏమాత్రం ఉత్కంఠ, టెన్షన్ అన్నవి లేకుండా అత్యంత నీరసంగా సాగిన మ్యాచ్ ఈ టోర్నీలో ఇదే కావొచ్చు. పరుగుల వర్షం లేదు, వికెట్లు మెరుపులు లేవు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ అత్యంత పేవలంగా ఆడి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యఛేదనకు వచ్చిన లక్నో.. బ్యాటర్లు వరుస డకౌట్‌లో పెవిలియన్ బాట పట్టారు. ఏదో మిఛెల్ మార్ష్ కాస్త నిలబడి ఆడినా లాభం లేకుండా పోయింది. రాజస్థాన్ బౌలర్లు బెంబేలెత్తించలేదు కానీ.. లక్నో బ్యాటర్లు మాత్రం బెంబేలెత్తిపోయారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఆరంభం అస్సలు కలిసి రాలేదు. యశస్వి జైస్వాల్ (22) జోరు మీదున్న దశలో షమీ వరుస బంతుల్లో జైస్వాల్, ధ్రువ్ జురెల్ (0) వికెట్లు తీసి షాక్ ఇచ్చాడు. ఆ వెంటనే వైభవ్ సూర్యవంశీ (8) కూడా అవుట్ అవ్వడంతో 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఆర్ఆర్ కష్టాల్లో పడింది. రియాన్ పరాగ్ (20), హెట్మెయర్ (22) కాసేపు ఇన్నింగ్స్ నిలబెట్టినా.. లక్నో బౌలర్ మొహ్సిన్ ఖాన్ (2/17) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వారిని పెవిలియన్ పంపాడు. ఈ దశలో రవీంద్ర జడేజా (43 నాటౌట్; 29 బంతుల్లో) ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో శుభం దూబే (19 నాటౌట్)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగలిగింది.
రాజస్థాన్ నిర్దేశించిన 160 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఛేదించడంలో లక్నో సూపర్ జెయింట్స్ (RR vs LSG) పూర్తిగా తడబడింది. ఆరంభం నుంచే వికెట్లు పారేసుకుంటూ వచ్చిన లక్నో.. కేవలం 18 ఓవర్లలోనే 119 పరుగులకు కుప్పకూలింది. దీంతో రాజస్థాన్ 40 పరుగుల తేడాతో సునాయాస విజయాన్ని అందుకుంది. లక్నో బ్యాటర్లలో ఒక్క మిచెల్ మార్ష్ (55; 41 బంతుల్లో) తప్ప మిగిలిన వారెవరూ కనీసం పోరాట పటిమ చూపలేకపోయారు. అయూష్ బదోని, కెప్టెన్ రిషబ్ పంత్, ఐడెన్ మార్క్రామ్ వంటి కీలక ఆటగాళ్లు కనీసం ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడం లక్నోను కోలుకోలేని దెబ్బ తీసింది.
మొదటి మూడు ఓవర్లలోనే 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లక్నో అప్పుడే ఓటమిని కొనితెచ్చుకుంది. జోఫ్రా ఆర్చర్ తన వేగంతో మూడు వికెట్లు తీసి లక్నో ఇన్నింగ్స్ వెన్ను విరిచాడు. అతనికి తోడుగా నాండ్రే బర్గర్ రెండు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని మరింత ఒత్తిడిలోకి నెట్టాడు. నికోలస్ పూరన్ (22) కాసేపు క్రీజులో ఉన్నా, రవీంద్ర జడేజా అతన్ని బుట్టలో వేయడంతో లక్నో ఆశలు ఆవిరయ్యాయి. రాజస్థాన్ బౌలర్ల క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ముందు లక్నో బ్యాటర్లు నిలవలేక వరుసగా పెవిలియన్ బాట పట్టారు.
మధ్యలో హిమ్మత్ సింగ్ (15) కాసేపు మెరిసినా, అది ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే సరిపోయింది. చివర్లో బ్రిజేష్ శర్మ రెండు వికెట్లు పడగొట్టి లక్నో తోకను కట్ చేశాడు. కేవలం 119 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. బ్యాటింగ్‌లో రాణించిన జడేజా బౌలింగ్‌లోనూ వికెట్ తీయడం విశేషం. మొత్తానికి బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమైన లక్నో.. భారీ మూల్యాన్ని చెల్లించుకుంది.

