కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో (Telangana Cabinet) అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మె, ఉద్యోగులకు బకాయిల చెల్లింపుల వంటి కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిపింది.
సమ్మె విరమించాలని విజ్ఞప్తి..
ఆర్టీసీ సమ్మెను వెంటనే విరమించాలని కార్మికులను కేబినెట్ విజ్ఞప్తి చేసింది. కార్మికులు సంయమనం పాటించాలని, సమస్యలను పరిష్కరించాలనే సానుకూల వైఖరితోనే ప్రభుత్వం అధికారుల కమిటీ వేసిందని పేర్కొంది. రేపు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో చర్చలకు రావాలని కార్మిక సంఘాలను కోరింది.
ప్రజాప్రతినిధుల జీతాల్లో 50 శాతం కోత..
రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అందకపోవడంతో వారి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులపై మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వారికి ఇచ్చే బకాయిల చెల్లింపులకు తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ ఉద్యోగులకు రూ.6,200 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు రూ.8 వేల కోట్లు పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించింది. అవసరమైన నిధులు సర్దుబాటు చేయడంతో పాటు అవసరమైతే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులకు ఇచ్చే జీతాల్లో నుంచి 50 శాతం కోత విధించుకునేందుకు నిర్ణయించింది. అలా మిగిలిన నిధులను రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే సర్దుబాటు చేయాలని తీర్మానించింది. 100 రోజుల్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు దిశగా తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.
ప్యాక్స్ పాలకవర్గాల నామినేట్..
రాష్ట్రంలో పదవీ కాలం పూర్తయిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు (PACS) నామినేట్ పద్ధతిన పాలకవర్గాలను నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
పీపీపీ పద్ధతిలో గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి..
గచ్చిబౌలి స్టేడియాన్ని పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 76 ఎకరాల్లో 64 ఎకరాల్లో 21 రకాల క్రీడా సౌకర్యాలు కల్పించడంతో పాటు అవుట్ డోర్ స్టేడియం సామర్థ్యం 20 వేల నుంచి 50 వేలకు పెంచాలని నిర్ణయించింది. స్విమ్మింగ్ పూల్ సామర్థ్యం పెంపుతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగిలిన 12 ఎకరాలను డెవలపర్స్ కు ఇచ్చి వాణిజ్య అవసరాలకు అద్దెకు ఇవ్వనుంది. ఇలా వచ్చిన నిధులతో స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్వహణ, క్రీడాకారుల వసతి, శిక్షణ ఇతర కార్యక్రమాలకు ఉపయోగించాలని నిర్ణయించింది..
చిన్న కాళేశ్వరం భూ సేకరణకు గ్రీన్ సిగ్నల్..
మంథని నియోజకవర్గ ప్రాంత ప్రజల చిరకాల కోరిక చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. మహాదేవ్‌పూర్, కాటారం, మల్హర్ రావు, మహముత్తారం మండలాల్లో దాదాపు 45 వేల ఎకరాలకు, 63 గ్రామాల ప్రజలకు ఈ ప్రాజెక్టుతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు 2,427 ఎకరాల భూమి అవసరం కాగా, ఇప్పటి వరకు 1,020 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూసేకరణకు అవసరమయ్యే రూ.166.67 కోట్ల ప్రతిపాదనలకు కేబినేట్ ఆమోదం తెలిపింది.
ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటు
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని మంచిర్యాల జిల్లా హాజీపూర్ రెవెన్యూ పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇరిగేషన్ శాఖకు చెందిన 85.10 ఎకరాలను మత్స్య శాఖకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

