బిట్స్ పిలానీ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో విద్యా, సాంకేతిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) పేర్కొన్నారు. ఈ క్రమంలో బిట్స్ పిలాని ప్రతినిధులు గురువారం సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న Birla Institute of Technology and Science, Pilani (బిట్స్ పిలాని) అమరావతి క్యాంపస్ పురోగతిపై వారు సీఎంకు వివరించారు. క్యాంపస్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచ స్థాయి విద్యాసంస్థగా తీర్చిదిద్దుతున్నామని ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం టెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాలపై దృష్టి సారిస్తూ ప్రత్యేక కోర్సులు, పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఈ క్యాంపస్‌ను ఐకానిక్, ఏఐ ఆధారిత విద్యా కేంద్రంగా రూపుదిద్దుతున్నామని చెప్పారు.

టెక్నాలజీలో ఏపీ ముందుండాలి: చంద్రబాబు

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు (Chandrababu) మాట్లాడుతూ, భవిష్యత్ టెక్నాలజీల్లో రాష్ట్రం ముందంజలో ఉండాలంటే స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇవ్వడం కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా క్వాంటం టెక్నాలజీ రంగంలో యువతను ప్రోత్సహిస్తూ, స్టార్టప్‌లకు అనుకూల వాతావరణం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు, స్టార్టప్‌లు కలిసి పనిచేసే విధంగా ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి విద్యా, సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దడంలో బిట్స్ పిలాని వంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యం కీలకమని సీఎం పేర్కొన్నారు. ఈ క్యాంపస్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు, నాణ్యమైన ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>