కలం, నల్లగొండ బ్యూరో : తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ కాబోతోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న రెండు బెర్తుల్లో ఎవరికీ ఛాన్స్ దక్కుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం సామాజికవర్గాల లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం వల్ల లంబాడా వర్గానికి ఈసారి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో నలుగురు రెడ్డి సామాజికవర్గం నుంచి, నలుగురు ఎస్సీలు, ముగ్గురు బీసీలతో పాటు మరో ముగ్గురు అగ్రవర్ణాలు, ఒక మైనార్టీ, ఒక ఎస్టీ సామాజికవర్గానికి ప్రజాప్రతినిధులు మంత్రులుగా ఉన్నారు. అయితే లంబాడా సామాజికవర్గం నుంచి ఒక్కరికీ కూడా ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో రానున్న మంత్రివర్గంలో లంబాడా సామాజికవర్గానికి బెర్త్ పక్కా అని తేలిపోయింది. ఈ సామాజికవర్గం నుంచి ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ (Nenavath Balu Naik) పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. అయితే ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు రెడ్డి సామాజికవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో మూడో అమాత్య పదవి జిల్లాకు దక్కుతుందా..? అన్న అనుమానాలు లేకపోలేదు.
లంబాడా సామాజికవర్గం నుంచి సీనియర్ లీడర్
దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్. మాజీమంత్రి కుందూరు జానారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే బాలునాయక్ సుదీర్ఘకాలంగా మంత్రి పదవిని ఆశిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటివరకు బాలునాయక్‌కు తగిన ప్రాతినిధ్యం దక్కలేదు. అయితే మంత్రివర్గంలో లంబాడా ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల రామచంద్రునాయక్, బాలునాయక్ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే రామచంద్రనాయక్‌కు ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రకటించారు. కానీ రామచంద్రునాయక్ ఇప్పటివరకు ఆ బాధ్యతలను స్వీకరించలేదు. వాస్తవానికి డిప్యూటీ స్పీకర్ రేసులో బాలునాయక్ పేరు విన్పించింది. కానీ అనూహ్యంగా రామచంద్రునాయక్ పేరును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఆ ఆశలు గల్లంతయ్యాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ మంత్రివర్గంలో లంబాడా సామాజికవర్గం నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తేనే.. సమన్యాయం జరుగుతుందనే భావనలో హైకమాండ్ ఉండడం వల్ల బాలునాయక్‌కు అమాత్య పదవి ఖాయమనే ప్రచారం ఉంది. మరోవైపు ఉమ్మడి జిల్లాలో దేవరకొండ నియోజకవర్గం దశాబ్దాల కాలంగా అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉంది. బాలునాయక్‌కు మంత్రి పదవి దక్కితే.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం లేకపోలేదు.
కోమటిరెడ్డి వర్గానికి చెక్..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధిపత్యం పెరిగిపోయింది. ఈ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారనే ప్రచారం లేకపోలేదు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి వర్గానికి ఉమ్మడి జిల్లాలో ప్రయారిటీ ఇస్తున్నారనే వాదన లేకపోలేదు. ఈ క్రమంలోనే మాజీమంత్రి కుందూరు జానారెడ్డి వర్గీయుడు కొనసాగుతూ వస్తున్న బాలునాయక్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే.. సామాజిక న్యాయం జరగడంతో పాటు జిల్లాలో కోమటిరెడ్డి వర్గానికి చెక్ పెట్టినట్టు అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే.. ఉమ్మడి జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా కొనసాగుతున్నారు. అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం మంత్రి పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పటికే రెడ్డి సామాజికవర్గం నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. అయినా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని ఆశించడం విమర్శలకు దారితీస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలోని ఇతర సామాజికవర్గాల నుంచి అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బాలునాయక్‌కు మంత్రివర్గంలో బెర్త్ దొరకడం ఖాయంగా మారింది. దీనికితోడు మాజీమంత్రి కుందూరు జానారెడ్డి సపోర్టు ఉండడం బాలునాయక్‌కు కలిసి వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.

