కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ శాసనసభ సమావేశాలు (Telangana Budget Sessions) జరిగే ప్రతిసారీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ (KCR) అటెండెన్స్ పై సభ్యుల మధ్య చర్చ జరుగుతూ ఉంటుంది. ఆయన వచ్చినా, రాకపోయినా అటెండ్ అవుతారా?.. కారా?.. అనేది రెండు రోజుల ముందుగానే పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేల మధ్య డిస్కషన్ పాయింట్‌గా తయారవుతుంది. ఈ నెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నందున ఆయన హాజరుపై చర్చ మొదలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తిచేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికి మూడుసార్లు మాత్రమే కేసీఆర్ హాజరయ్యారు. ఏడాదికోసారి చొప్పున అటెండ్ అయినట్లయిందీ. చివరిసారి గతేడాది డిసెంబరు 29న శీతాకాల సమావేశాల మొదటి రోజున హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) స్వయంగా కేసీఆర్ సీటు దగ్గరకు వెళ్ళి పలకరించారు.
ఈసారి హాజరుపై మొదలైన సందేహం :
ఇప్పటివరకు కేసీఆర్ మూడుసార్లు సభకు హాజరయ్యారు. ఫస్ట్ టైమ్ 2024 జూలై నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. ఆర్థికమంత్రిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) బడ్జెట్ ప్రసంగం (జూలై 25) జరిగే రోజున ఆ స్పీచ్ పూర్తయ్యేంత వరకు సభలోనే ఉన్నారు. ఆ తర్వాత మీడియా పాయింట్ దగ్గర పాత్రికేయులతో మాట్లాడే సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రెండోసారి గతేడాది మార్చి 12న జరిగిన బడ్జెట్ సెషన్ ఫస్ట్ డే హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం పూర్తయ్యేంత వరకు ఉండి వెళ్ళిపోయారు. మూడోసారి గతేడాది డిసెంబరు 29న జరిగిన శీతాకాల సమావేశాల మొదటి రోజున హాజరయ్యారు. దివంత సభ్యులకు సంతాపం తెలిపే కార్యక్రమం వరకు ఉండి వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ ఈ నెల 16 నుంచి బడ్జెట్ సెషన్ జరుగుతున్నందున కేసీఆర్ హాజరుపై గుసగుసలు మొదలయ్యాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారా?.. లేక బడ్జెట్ స్పీచ్ (మార్చి 20) రోజు హాజరవుతారా?.. లేక మొత్తానికే గైర్హాజరవుతారా?.. ఇవీ ఆ చర్చల్లోని సారాంశం.
బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి గైర్హాజరు :
అసెంబ్లీ సమావేశాలకు ముందు సాధారణంగా అన్ని పార్టీలు నిర్వహించుకునే తరహాలోనే బీఆర్ఎస్ సైతం శాసనసభా పక్ష సమావేశాన్ని ఈ నెల 10న గోల్కొండ రిసార్టులో నిర్వహించింది. పార్టీ అధినేతగా కేసీఆర్ (KCR) హాజరు కావాల్సి ఉన్నా అటెండ్ కాలేదు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ బడ్జెట్ బేసిక్స్ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కలిగించారు. ముగింపు కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగించారు. ఎల్పీ సమావేశానికి హాజరు కానందున బడ్జెట్ సెషన్‌కు కూడా కేసీఆర్ హాజరయ్యే అవకాశం లేదన్న సందేహాలు మొదలయ్యాయి. ఆరు నెలల నిబంధన ప్రకారం ఈసారి అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేయకపోయినా ఇబ్బందేమీ లేదన్న ఉద్దేశంతో బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉండే అవకాశమున్నది. ఇలాంటి మాటలే బీఆర్ఎస్ లీడర్ల నుంచి వినిపిస్తున్నాయి.
Read Also: విగ్రహాలు.. వివాదాలు
Follow Us On: Instagram

