కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో జనసేన (Janasena) 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పాడేరు ఏజెన్సీలో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భారీగా జన సైనికులు, వీర మహిళలు హాజరయ్యారు. అధినేతతో కలిసి జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ నందిగరువులో నిర్వహించిన మన ఊరు – మాటా మంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనుల కుటుంబాలతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా గిరిజనుల సమస్యలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. అలాగే వారి అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. 70 ఏళ్లుగా రోడ్డు లేని ప్రాంతానికి కూటమి ప్రభుత్వ హయాంలో రోడ్లు వేశామని వెల్లడించారు. గత రెండేళ్లలో ఏజెన్సీలో 460 కి.మీ. రోడ్లు నిర్మించామని.. జల్ జీవన్ మిషన్ (Jal Jeevan Mission) కింద 3000 గ్రామాలకు తాగునీరు అందించామని చెప్పుకొచ్చారు. మల్టీ విలేజ్ స్కీమ్ ద్వారా గ్రామాల అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. జీవో నెంబర్ -3పై సీఎం దృష్టికి తీసుకెళ్తానని.. కేబినెట్ లో చర్చిస్తామని హామీ ఇచ్చారు. గిరిజనుల హక్కులకు భంగం కలగనివ్వనని తెలిపారు.
కాగా, ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత ఓనూరు జంక్షన్‌లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్ , అక్కడి నుంచి కాలినడకన తన పర్యటన కొనసాగించారు. ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు వరకు సుమారు 2.4 కిలోమీటర్ల మేర నిర్మించిన కొత్త రహదారిపై నడుస్తూ, మార్గమధ్యంలో గిరిజనులతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ‘అడవితల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన రోడ్లను పవన్ (Pawan Kalyan) ప్రారంభించారు.
Read Also: గ్యాస్ ఎఫెక్ట్.. ఒక్క రోజే 1.34 లక్షల ఇండక్షన్ స్టవ్స్ అమ్మకాలు
Follow Us On : WhatsApp

