కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ (Telangana Budget 2026) సన్నాహాలను మొదలుపెట్టింది. ఇప్పటికే శాఖలవారీగా ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. ఆర్థిక మంత్రి బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఈ నెల 17 నుంచి అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో రివ్యూ నిర్వహించనున్నారు. గతేడాది చేసిన బడ్జెట్ కేటాయింపులు, విడుదలైన నిధులు, ఆయా శాఖలు చేసిన ఖర్చులు, అదనపు కేటాయింపులు.. వీటన్నింటిపై చర్చించనున్నారు. రాబోయే బడ్జెట్‌లో ప్రభుత్వ ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుని ఆయా శాఖల ప్రతిపాదనలను రివ్యూ చేయనున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రితో (Revanth Reddy) ప్రత్యేకంగా సమావేశమై ఆ ప్రతిపాదనలను వివరించనున్నారు. మంత్రివర్గ భేటీలో చర్చించి బడ్జెట్ తుది రూపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. మార్చి థర్డ్ వీక్‌లో అసెంబ్లీ సెషన్ నిర్వహించేలా కసరత్తు జరుగుతున్నది.
వాస్తవిక బడ్జెట్‌పైనే మెయిన్ ఫోకస్ :
గత ప్రభుత్వం బడ్జెట్‌లలో అంకెలగారడీ చేసిందంటూ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. దీంతో వాస్తవిక బడ్జెట్‌ను (Realistic Budget) పెట్టాలని నిర్ణయించింది. గత రెండు బడ్జెట్‌లపై ఇదే వ్యాఖ్యలు చేశారు. రాబోయే బడ్జెట్‌ను సైతం అదే తరహాలో రూపొందించనున్నట్లు డిప్యూటీ సీఎం ఇటీవల తెలిపారు. దీనికి అనుగుణంగానే శాఖలవారీగా చర్చలు జరగనున్నాయి. ఏయే పథకానికి ఎన్ని నిధులు అవసరం?.. కొత్త స్కీమ్‌లకు పెట్టిన ప్రతిపాదనలేంటి?.. ప్రస్తుత బడ్జెట్‌లో ఖర్చు కాకుండా మిగిలిపోయిన నిధులెన్ని?.. కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ సంక్షేమ పథకాలకు రావాల్సిన నిధులెంత?.. ఇలాంటివాటిపై అధికారుల నుంచి నిర్దిష్ట గణాంకాలను తీసుకుని గత బడ్జెట్‌కు సవరణలు చేసి ‘సవరించిన బడ్జెట్’ (Revised Budget) లెక్కలను ప్రస్తావించనున్నారు. ఆ తర్వాత రాబోయే సంవత్సరంలో శాఖలు, స్కీమ్‌లవారీగా నిధుల కేటాయింపు చేయనున్నారు.
బడ్జెట్ తయారీకి పన్నెండు రోజులు :
కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో డిజిటల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందున ఐదు రోజుల్లోనే ప్రింటింగ్ ప్రాసెస్ పూర్తి చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి హల్వా సెర్మనీని జనవరి 27న ప్రారంభించారు. జనవరి 31కు బడ్జెట్ ప్రింటింగ్ పూర్తికావడంతో ఫిబ్రవరి 1న పార్లమెంటులో ఆమె ప్రవేశపెట్టారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రింటింగ్ రూపంలో బడ్జెట్‌ను రూపొందిస్తున్నందున పది నుంచి పన్నెండు రోజుల టైమ్ పట్టే అవకాశమున్నదని ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. ఎలాగూ ఈ నెల 17 నుంచి అన్ని శాఖలతో డిప్యూటీ సీఎం నిర్వహించే రివ్యూ మీటింగులు వారం రోజులు పట్టే అవకాశమున్నది.
వచ్చే నెల 5న డిప్యూటీ సీఎం కుమారుడి వివాహం ఉన్నందున ఆ లోపే అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం లేదని తెలిపాయి. డిప్యూటీ సీఎం ఇంట వివాహ వేడుక కంప్లీట్ అయిన తర్వాతనే బడ్జెట్ (Telangana Budget 2026) హడావిడి మొదలవుతుందని అభిప్రాయపడ్డాయి. ప్రింటింగ్ కోసం కనీసం పది రోజులైనా పడుతుందనే ఉద్దేశంతో మార్చి థర్డ్ వీక్‌లోనే అసెంబ్లీ సెషన్ ఉండొచ్చన్న అభిప్రాయాన్ని ఆర్థికశాఖ వర్గాలు వ్యక్తం చేశాయి.
Read Also: చట్టసభల్లో సభ్యులకు భద్రత ఎంత? మోదీకి సైతం ముప్పు?
Follow Us On: X(Twitter)


